ప్రజలంతా కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. అంతా జాగ్రత్తగా ఉంటే ఏ వైరస్ కూడా దగ్గరకు రాదని చెప్పారు. కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కూడా మ‌న ద‌రికి రాబోదని చెప్పాడు. అందరూ జాగ్రత్తగా ఉంటే క‌రోనాను అరిక‌ట్టవచ్చని అన్నారు. టీకాలు ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ప్రజలకు మంత్రి హ‌రీశ్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌ ప‌ల్లిలో బ‌స్తీ ద‌వాఖానాను మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయ‌న ప్రసంగించారు.


ఒమిక్రాన్ వేరియంట్ తెలంగాణ‌కు రాలేదని హ‌రీశ్‌ రావు స్పష్టం చేశారు. క‌ర్ణాట‌క‌లో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ వ‌చ్చిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ధ్రువీకరించిందని తెలిపారు. ‘‘హైద‌రాబాద్‌లో, తెలంగాణ‌లో దేవుడి ద‌య‌వ‌ల్ల కొత్త వేరియంట్ రాలేదు. బ్రిట‌న్ నుంచి వ‌చ్చిన మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఆమె శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాం. నాలుగైదు రోజుల్లో ఆమెకు ఏ వేరియంట్ సోకిందనేది నిర్ధారణ అవుతుంది. కాబట్టి, అందరూ మాస్కు ధ‌రించండి.. టీకాలు వేసుకోండి.. ఎల్లప్పుడూ చేతులు శుభ్రంగా క‌డుక్కోవాలి. స్వీయ నియంత్రణ పాటించాలి’’ అని హరీశ్ రావు సూచించారు. వీట్నింటిని పాటిస్తే క‌రోనాను త‌రిమి కొట్టవచ్చు. అందరూ ప్రభుత్వానికి స‌హ‌క‌రించాలని అన్నారు.


Also Read: East Godavari: జవాద్ తుపానుతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం... వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు... కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు


వ్యాక్సిన్ కూడా అందరూ తీసుకోవాలి
తెలంగాణ వ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది ఫస్ట్ డోస్ తీసుకున్నారని హరీశ్ రావు తెలిపారు. మొదటి, రెండో డోసులు రెండూ తీసుకున్నవారు కోటి 30 ల‌క్షల మంది మాత్రమే తీసుకున్నారని అన్నారు. చాలా మంది రెండో డోసు తీసుకోలేదని.. వారంతా తక్షణం వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. వ్యాక్సిన్ల గురించి ఎలాంటి అపోహలు అక్కర్లేదని.. అనుమానాలు, అపోహాలు అవ‌స‌రం లేదని హితవు పలికారు. రెండు డోసులు తీసుకుంటే మ‌న ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చని అన్నారు. 18 ఏళ్లు దాటి ప్రతిన ఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలని, టీకాలు వేసేందుకు ఆరోగ్య కార్యక‌ర్తలు ఎంతో కృషి చేస్తున్నారని వివరించారు.’’ అని హరీశ్ రావు అన్నారు.