Harish Rao: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాడు తెలంగాణలోఉస్మానియా, గాంధీ, వరంగల్‌లో ఎంజీఎం మెడికల్ కళాశాలు మాత్రమే ఉండేవని మంత్రి గుర్తు చేశారు. నేడు కేసీఆర్ నాయకత్వంలో 33 జిల్లాలకు 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వస్తున్నాయన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా మారిందన్నారు. గతంలో సర్కార్ దవాఖానాల్లో మందులు దొరకని పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 17 వేల పడకలు ఉంటే.. ఈ రోజు 50 వేల పడకలు అందుబాటులోకి వచ్చాయన్నారు.
వైద్యం, విద్య ప్రతి ఒక్కరికి అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు. మంత్రి సబిత నేతృత్వంలో విద్యా రంగాన్ని బలోపేతం చేస్తున్నామని, మన ఊరు – మన బడి ప్రారంభించుకున్నట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టామన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అడగగానే సీఎం కేసీఆర్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేశారని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో 550 పడకలతో ఆస్పత్రి నిర్మాణం చేపడతామని, వారం పది రోజుల్లో మహేశ్వరం మెడికల్ కళాశాల శంకుస్థాపనకు ఏర్పాట్లు చేస్తామన్నారు.
సబితా ఇంద్రారెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలతోనే ఉంటారని కితాబిచ్చారు. నాగిరెడ్డిపేట వద్ద ఐటీ టవర్ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. విషయాన్ని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. బైపాస్ రోడ్డు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే మంజూరు చేయిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశమంతా తెలంగాణ వైపు చూస్తోందని, చెరువుల అభివృద్ధిలో కర్ణాటక మనల్ని కాపీ కొడుతోందని అన్నారు.
మూడు గంటలు కరెంట్ ఇస్తే మూడు ఎకరాలు పారుతుందో లేదో రైతులు చెప్పాలని అడిగారు. 3 గంటలు కరెంట్ కావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, 24 గంటలు కరెంట్ కావాలంటే కేసీఆర్‌కు ఓటు వేయాలని కోరారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 8 గంటల కరెంట్ కూడా ఇవ్వలేకపోతుందని మంత్రి తెలిపారు. బెంగళూరు నగరంలో కరెంట్ కోతలు ఉన్నాయని కానీ తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దత్తత తీసుకున్న తిమ్మాపూర్‌లో రూపాయి పనిచేయలేదన్నారు. బావుల వద్ద మీటర్లు పెట్టలేదని తెలంగాణకు కేంద్రం రూ.35 వేల కోట్ల ఆపిందని ఆరోపించారు. రైతు రుణాలను లక్ష రూపాయల వరకు పూర్తిగా మాఫీ చేస్తామన్నారు.
నాడు రూ.400 ఉన్న సిలిండర్‌ను బీజేపీ రూ.1200కి పెంచిందని విమర్శిచారు. ధరలు పెంచుడేమో బీజేపీ పని అని.. పేదలకు నిధులు పంచుడేమో కేసీఆర్ పని అన్నారు. ఆడ పిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, కాన్పుకు వెళ్తే కేసీఆర్ కిట్ అందిస్తున్నామన్నారు. రంగారెడ్డి జిల్లాలో 95 వేల మంది మహిళలకు వడ్డీతో సహా అభయహస్తం డబ్బులు వారం రోజుల్లోగా ఖాతాల్లో జమ చేస్తామని అని మంత్రి వెల్లడించారు.