ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్య - 'మెట్రో రైల్' విస్తరణే ప్రధాన పరిష్కారం 

దేశంలోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్యకు మెట్రో రైల్ నెట్వర్క్ విస్తరణే ప్రధాన పరిష్కారమని ఉస్మానియా ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. విదేశాల్లో మెట్రో రైల్ నెట్వర్క్ పరిశీలించిన ఆయన పలు సూచనలు చేశారు.

Continues below advertisement

'ఆఫీసుకు త్వరగా చేరుకోవాలి. లేకుంటే బాస్ తో తిట్లు తినాలి. బైక్ పై ఈ ట్రాఫిక్ లో ఎంత టైం పడుతుందో.?' ఓ సామాన్య ఉద్యోగి ఆవేదన. 'ఈవినింగ్ ఇంటికి త్వరగా వెళ్లాలి. మెట్రోలో రద్దీ ఎక్కువ ఉంటుంది. కనీసం నిలబడ్డానికి ప్లేస్ దొరికినా చాలు. కొంచెం మెట్రో రైల్స్ ఎక్కువ వెయ్యొచ్చు కదా.' ఓ ఐటీ ఉద్యోగి మనసులో మాట!. 

Continues below advertisement

ఇది ఓ సాధారణ ఉద్యోగి, ఐటీ ఉద్యోగి ఆవేదన మాత్రమే కాదు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో సామాన్య ప్రజలందరి ఆవేదన. ప్రస్తుతం దేశంలోని నగరాల్లో, పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. లక్షల మంది నివసించే నగరాల్లో రహదారుల విస్తరించి రద్దీ సమస్యను పరిష్కరించడం కూడా ఓ సవాలే. అయితే, ఈ సమస్యకు మెట్రో రైల్ నెట్వర్క్ ను విస్తరించడమే ప్రధాన పరిష్కారమని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి అనుగుణంగా ప్రజా రవాణా, పర్యావరణంపై ఉస్మానియా వర్శిటీ  పట్టణ పర్యావరణ ప్రాంతీయ కేంద్రం అధ్యయనం చేస్తోంది. తాజాగా, వివిధ దేశాల నగరాల్లో మెట్రో రైల్ వ్యవస్థలను పరిశీలించింది. ఆయా దేశాల్లో మెజారిటీగా ప్రతి 50 లక్షల మంది జనాభాకు 200 కి.మీ మెట్రో రైల్ నెట్వర్క్ ఉన్నట్లు గుర్తించింది. మన మెట్రోలోనూ ఇలాంటి విధానం అందుబాటులోకి తేవాలని ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో ప్రొఫెసర్ కుమార్ మొలుగరం వివరించారు.

ఆయా దేశాల్లో 'ఈజీ వే టూ మెట్రో'

లండన్, న్యూయార్క్, సింగపూర్ వంటి నగరాల్లో మెట్రో రైల్ నెట్వర్క్ విస్తరణలో అక్కడి యంత్రాంగం పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు ప్రొఫెసర్ కుమార్ తెలిపారు. ఆ వ్యవస్థలను ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 

  •  సింగపూర్ జనాభా 56 లక్షలుగా ఉంటే, అక్కడ 203 కిలో మీటర్ల మెట్రో రైల్ నెట్వర్క్ ప్రజలకు అందుబాటులో ఉంది. రోజుకు సుమారు 34 లక్షల మంది ఇందులో ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు.
  • లండన్ లో అక్టోపస్ లా మెట్రో రైల్ నెట్వర్క్ విస్తరించి ఉన్నట్లు ప్రొఫెసర్ తెలిపారు. నగర ప్రజలందరికీ 2, 3 కిలో మీటర్ల దూరంలోనే మెట్రో స్టేషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అక్కడ రోజుకు దాదాపు 50 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నట్లు చెప్పారు. 
  • న్యూయార్క్ జనాభా 84 లక్షలుండగా 394 కిలో మీటర్ల మెట్రో రైల్ నెట్వర్క్ వారికి అందుబాటులో ఉంది. మొత్తం 472 స్టేషన్లలో రోజుకు 55 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు.

మన హైదరాబాద్ లో చూస్తే

గ్రేటర్ హైదరాబాద్ లో కోటి మంది జనాభాకు 400 కిలో మీటర్ల మేర మెట్రో రైల్ నెట్వర్క్ అవసరం. అయితే, ప్రసుతం 72 కిలో మీటర్లే ఉంది. రోజుకు సుమారు 5 లక్షల మందే ప్రయాణిస్తున్నారు. 
విదేశాల్లోని నగరాలతో పోలిస్తే మన దగ్గర మెట్రో నెట్వర్క్ ను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ కుమార్ వివరించారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా ఉదయం, సాయంత్రం ఆయా ప్రాంతాలకు మెట్రో రైళ్లు మరింత పెంచాలని తద్వారా ట్రాఫిక్ సమస్య కొంతైనా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Continues below advertisement