Tahawwur Rana extradited: ముంబై దాడుల కేసులో కీలక కుట్రదారుడైన తహవూర్ హుస్సేన్ రాణాను అమెరికా నుండి విజయవంతంగా భారతదేశానికి తీసుకొచ్చారు. పాకిస్తాన్ సంతతికి చెందిన 64 ఏళ్ల కెనడియన్ జాతీయుడు గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకు వచ్చారు.  జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ,  US స్కై మార్షల్స్ సీనియర్ అధికారులు ఆయన రక్షణ చూస్తున్నారు. ఢిల్లీలోని పాలం ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయిన వెంటనే  2008 ఉగ్రవాద దాడులకు సంబంధించి రాణాను NIA అధికారికంగా అరెస్టు చేసింది. గోధుమ రంగు దుస్తులు ధరించి, తెల్లటి గడ్డం ధరించి, NIA సిబ్బంది పక్కన ఉన్న రాణా   మొదటి అధికారిక ఛాయాచిత్రాన్ని కూడా ఏజెన్సీ విడుదల చేసింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

అరెస్టుపై కీలక ప్రకటన చేసిన ఎన్ఐఏ 

అంతకు ముందు ఎన్ఐఏ  తహవ్వూర్ రాణాను తీసుకు వచ్చిన తర్వాత   కీలక ప్రకటన చేసింది.   2008 ముంబై ఉగ్రవాద దాడుల బాధితులకు న్యాయం అందించే దిశగా ఒక ముఖ్యమైన మైలురాయిగా ఏజెన్సీ పేర్కొంది. తహవూర్ రాణాను తీసుకు రావడానికి జరిగిన ప్రయత్నాలు నిరంతరం జరిగాయని తెలిపారు.  భారత-అమెరికా అప్పగింత ఒప్పందం ప్రకారం ప్రారంభించిన చర్యల ప్రకారం రాణాను అమెరికాలో జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారని..  రాణా ఈ చర్యను ఆపడానికి అన్ని చట్టపరమైన మార్గాలను వినియోగించుకున్నారని NIA తెలిపింది. అమెరికా సుప్రీంకోర్టులో కూడా ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత భారత్ కు అప్పగించారని తెలిపారు.    

ఇండియాకు తరలించకుండా ఉండేదుకు అన్ని ప్రయత్నాలు చేసిన రాణా

అమెరికాలో  ఉగ్రవాది తహవూర్ రాణా తొమ్మిదవ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో  అనేక వ్యాజ్యాలు దాఖలు చేశాడు. అన్నింటినీ తిరస్కరించారు.  తరువాత  అమెరికా సుప్రీంకోర్టులో రిట్ ఆఫ్ సర్టియోరారీ పిటిషన్, రెండు హెబియస్ పిటిషన్లు,   అత్యవసర దరఖాస్తును దాఖలు చేశాడు, వాటిని కూడా తిరస్కరించారని NIA తెలిపింది. అమెరికా DoJ, US స్కై మార్షల్  సాయంతో NIA మొత్తం అప్పగింత ప్రక్రియ పూర్తి చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ,యు హోం మంత్రిత్వ శాఖ అమెరికాలోని ఇతర సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని  విజయవంతంగా ఉగ్రవాది రాణాను తీసుకు వచ్చేందుకు కృషి చేశాయని ఎన్‌ఐఏ తెలిపింది.             

కఠిన శిక్ష విధించాలని అంటున్న ముంబై బాంబు పేలుళ్ల నిందితులు 

2008లో ముంబైలో విధ్వంసకర ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి తహవూర్ హుస్సేన్ రాణా డేవిడ్ కోల్మన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీ ,  ఉగ్రవాద గ్రూపుల కార్యకర్తలతో కలిసి లష్కరే తోయిబా ,  హర్కత్-ఉల్-జిహాదీ ఇస్లామి (HUJI)   పాకిస్తాన్‌కు చెందిన ఇతర సహ-కుట్రదారులతో కలిసి కుట్ర పన్నాడని  ఎన్‌ఐఏ తెలిపింది. ముంబై ఉగ్ర ఈ కుట్రలో రాణా కీలక పాత్ర పోషించినట్లు NIA స్పష్టం చేసింది.