Mega Dairy Project: రాష్ట్రంలో పాడిరంగంలో భారీ ప్రాజెక్టు సిద్ధమైంది. మెగా డెయిరీని సిద్ధం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మెగా డెయిరీలో రోజుకు 8 లక్షల లీటర్ల పాలను శుద్ధి చేయడంతో పాటు 10 టన్నుల నెయ్యి, 10 వేల లీటర్ల ఐస్‌క్రీం తయారీ సామర్థ్యంతో దీనిని నిర్మించారు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో నిర్మించిన ఈ భారీ ప్లాంటును ఈ నెల 5వ తేదీన రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. దేశంలోనే ప్రభుత్వరంగంలో అతి పెద్ద డెయిరీ ప్లాంటు అయిన ఇది రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధి, రైతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, భారీ ఎగుమతులు వంటి బృహత్తర లక్ష్యాలతో దీనిని నిర్మించారు.
తెలంగాణ రాష్ట్రంలో రోజూ ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య (విజయ డెయిరీ) ద్వారా 1.30 లక్షల మంది రైతుల నుంచి 4 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. మరింత ఎక్కువ పరిమాణంలో పాలను విక్రయించేందుకు రైతులు ముందుకు వచ్చేలా శుద్ధి సామర్థ్యం లేకపోవడంతో ఎక్కువ మొత్తంలో పాలను సేకరించడం లేదు. ఈ క్రమంలోనే నాలుగు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల సేకరణ, ఉత్పత్తులను భారీగా పెంచేందుకు మెగా డెయిరీ ప్రతిపాదన వచ్చింది. ఈ మేరకు దేశంలోని వివిధ డెయిరీలను అధ్యయనం చేసిన తర్వాత ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయించారు.
ఈ మెగా ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 240 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రాజెక్టు వ్యయానికి సంబంధించి రాష్ట్ర సర్కారు రూ.75 కోట్లు గ్రాంటుగా ఇచ్చింది. అలాగే ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య రూ. 26 కోట్లు సమకూర్చింది. మరో రూ.146 కోట్లను జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య నుంచి రుణంగా తీసుకున్నారు. రెండు సంవత్సరాల కాలంలో ఈ భారీ డెయిరీ నిర్మాణం పూర్తయింది. ఇందులో 300 మంది సిబ్బంది నిత్యం విధులు నిర్వర్తిస్తారు. అలాగే ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 5 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
దేశంలోనే అత్యాధునిక, పూర్తి స్థాయి ఆటోమేషన్ ప్రాసెసింగ్ యంత్రాలను ఈ మెగా డెయిరీలో అమర్చారు. యంత్రాల ద్వారా శుద్ధితో అత్యంత నాణ్యమైన పాలు తయారు అవుతాయి. అలాగే పోషక విలువలు యథాతథంగా ఉంటాయి. డెయిరీని సౌర విద్యుత్ తో అనుసంధానం చేశారు. డెయిరీ నుంచి వచ్చే వ్యర్థాల ద్వారా ఇంధనాన్ని తయారు చేసే ఏర్పాట్లు కూడా చేశారు.
ఈ మెగా డెయిరీ ద్వారా దాదాపు 5 లక్షల మంది పాడి రైతుల నుంచి పాలను సేకరించనున్నారు. దీంతో పాటు.. విజయ డెయిరీ, దాని అనుబంధ జోనల్ కార్యాలయాల్లో రోజుకు మొత్తం 12 లక్షల లీటర్ల పాలను సేకరిస్తారు. పాల సేకరణ పెంపుదల కోసం ప్రభుత్వం సబ్సిడీపై గేదెలు, ఆవులను సరఫరా చేయనుంది. మెగా డెయిరీ ప్రారంభం దృష్ట్యా ప్రభుత్వ రంగంలో పాడి ఉత్పత్తులను విజయ డెయిరీ ద్వారా విక్రయించేందుకు వీలుగా కొత్త దుకాణాలను ప్రారంభిస్తారు. అంగన్ వాడీ కేంద్రాలతో పాటు ఇతర ప్రభుత్వరంగ సంస్థలకు పాల సరఫరా ప్రాజెక్టులను సైతం విజయ డెయిరీ చేపట్టనుంది.