కాళేశ్వరం ప్రాజెక్టులో అతి కీలకమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీ వంతెన కుంగిపోవడం ఆందోళనకరమని బీజేపీ ఎమ్మెల్యే, పార్టీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. పేరు తనకే రావాలని సంకుచిత ఆలోచనతో కాలేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. నాంపల్లిలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజేందర్ మాట్లాడారు.
వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులపై ఇంజనీర్ల అనుమానాలు నిజమేనని దీనివల్ల రుజువైందని ఈటల అన్నారు. బ్యారేజీ కుంగడం ఆందోళనకర విషయమని చెప్పారు. లక్షన్నర కోట్ల ప్రాజెక్టు దెబ్బతింటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అంచనాలు భారీగా పెంచి నిర్మించిన ప్రాజెక్టుల లోపాలు బయటపడుతున్నాయని ఆరోపించారు. ప్రారంభించిన మూడేళ్లలోనే పిల్లలు పుంగిపోవడం దారుణం అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నీటిపారుదల శాఖ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల వద్ద ఉన్నందున కాళేశ్వరం లో తప్పిదాలలో ఆ కుటుంబమే ముద్దాయిని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పే సీఎం కేసీఆర్, కేటీఆర్ లు వంతెన కొంగుబాటుపై ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. " ఆదివారం మేడిగడ్డ బ్యారేజీను పరిశీలించి వచ్చాం. గతంలో విశ్వేశ్వరరెడ్డి పలుమార్లు సందేహాలు లేవనెత్తారు. కాళేశ్వరం పై కేసీఆర్ మాట్లాడిన సమయంలో దాని నిర్మాణ తీరుపై నిపుణులు హెచ్చరించారు. అలోకేషన్ పద్ధతిలో కావాలని ప్రాజెక్టులు కొందరికి అప్పజెప్పారు. ఎలాంటి సాంకేతికత వాడకపోయినా ఇప్పటికీ నాగార్జునసాగర్ డ్యాం చెక్కుచెదరకుండా ఉంది. కాలేశ్వరంలోని మూడు ప్రాజెక్టులను అతి తక్కువ కాలంలో కట్టి జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు సైట్ ఎంపికలోను ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మేడిగడ్డ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీక్ అవుతుంది. ఇసుక మీదే ప్రాజెక్టు కట్టారు. కన్నేపల్లి పంప్ హౌస్ మొత్తం కూలిపోయింది. అప్పుడు నిపుణులను పంప్ హౌస్ పరిసరాల్లోకి రాకుండా 144 సెక్షన్ విధించారు. నిజాలను దాచే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వ తప్పిదం వల్ల వేలకోట్ల నష్టం జరుగుతోంది. ఇవాళ ప్రాజెక్టు పరిస్థితి నిర్మాణ లోపాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రాజెక్టులు కేవలం టూరిస్ట్ స్పాట్లుగా మిగులుతున్నాయి. ప్రజల డబ్బుతో కట్టిన ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వైఫల్యానికి సీఎం కేసీఆరే కారణం. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం తన పదవికి రాజీనామా చేయాలి. ఈ ఘటనపై నిపుణుల కమిటీ వేయాలి" అని ఈటల డిమాండ్ చేశారు.
శ్వేత పత్రం విడుదల చేయాలి
మేడిగడ్డ బ్యారేజీ వంతెన కొంగుబాటుకు బాధ్యులు ఎవరో... నష్టానికి కారకులెవరో సీఎం కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మేడిగడ్డ వంతెన గురించి ఆయన మాట్లాడారు. ఇది చిన్నదేనని, ఒక పిల్లర్ మాత్రమే దెబ్బతిందని చెబుతున్నారని అన్నారు. కానీ 15 నుంచి 22వ పిల్లర్ వరకు దెబ్బతిన్నట్లు తెలుస్తుందని చెప్పారు. పోలీసులను పెట్టి దాచినంత మాత్రాన నిజాలు దాగవు అని దుయ్యబడ్డారు. ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పరిశీలించి బాధ్యులను శిక్షించాలని ఈటెల డిమాండ్ చేశారు.