హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరితే.. బిజెపి మాత్రం ఈ రెండు పార్టీలకు షాకిచ్చేలా వ్యవహరించింది. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. కేసీఆర్ ను అరెస్ట్ చేయమంటూ రేవంత్ రెడ్డి ప్రకటించినప్పుడు, పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

బిజేపి ఎమ్మెల్యే ఏమన్నారంటే..కాళేశ్వరం కమిషన్ నివేదిక, వాళ్లు ఇచ్చిన నివేదిక కాదని, అది బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలసి ఇచ్చిన నివేదిక అంటూ అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మైక్ అందుకుని మాట్లాడటం మొదలుపెట్టగానే ఒక్కసారిగా బిఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పెద్దగా నవ్వులతో సభ దద్దరిల్లింది. కమిషన్ నివేదికలో ఎక్కడా కేసీఆర్, హరీష్ రావు అవినీతి గురించి లేకపోవడమే, ఆ రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనడానికి ఇదే  నిదర్శనమన్నారు. అవినీతి గురించి ఎక్కడా నివేదికలో ప్రస్తావించలేదు, అలా చెప్పనప్పుడు కమిషన్ ఎందుకు వేశారని బిజేపి డిమాండ్ చేస్తోందన్నారు. కేవలం ఐవాష్ కోసం మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారని ఆరోపించారు. 1952 యాక్ట్ ప్రకారం కమిషన్ వేసినప్పుడు ఎక్కడా నిబంధలు పాటించలేదు. కేవలం కంటితుడుపు చర్యగా మాత్రమే కమిషన్ వేసినట్లుగా కనిపిస్తోంది. ఈ నివేదిక కోర్టలో నిలబడే పరిస్దితి కనిపించడంలేదు. కోర్టు క్వాష్ చేస్తుందనే భయంతోనే ఆదివారం కూడా అసెంబ్లీ పెట్టి బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని బిజెపి ఎమ్మెల్యే ఆరోపించారు.

కాంగ్రెస్, బిఆర్ఎస్ లు ఆడుతున్న జగన్నాటకంగా కమిషన్ నివేదిక కనిపిస్తోంది. దోషులెవరో కమిషన్ నివేదికలో ఎక్కడా ప్రస్తావించకపోవడానికి కారణాలు ప్రభుత్వం చెప్పాలి. కాళేశ్వరం కట్టడం, కూలడం వెనుక మొత్తం కేసీఆర్ చేసిందేనని జగమెరిగిన సత్యం. కాళేశ్వరం నా మానస పుత్రిక అని చెప్పుకున్న కేసీఆర్, కమిషన్ ముందుకొచ్చినప్పుడు మాత్రం మాటమార్చారని విమర్శించారు. కరెష్ఫన్ ప్రాక్టీసెస్ మీద ఎంక్వరీ చేయమని ఎక్కడా కమిషన్ కు ఎందుకు చెప్పలేదు. కేసీఆర్ అవినీతి పై పూర్తి ఆధారాలు నావద్ద ఉన్నాయని  ఇన్నాళ్లు చెప్పిన  రేవంత్ రెడ్డి, ఆ ఆధారాలు కమిషన్ కు ఎందుకు ఇవ్వడంలేదు. కమిషన్ కు పూర్తి స్దాయి అధికారాలు ఎందుకు ఇవ్వడంలేదో సభముందు చెప్పాలని’ డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అవనీతికి పాల్పడిన బిఆర్ఎస్ నేతలను జైలుకు పంపుతామన్నారు, కానీ 21 నెలలు గడిచినా నేటికీ ఏ ఒక్కరినీ జైలుకు ఎందుకు పంపలేదో చెప్పాలని  ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ముహుర్తాల కోసం చూస్తున్నారా, లేక ముడుపుల కోసం  చూస్తున్నారో చెప్పాలి. కనీసం ఒక్కరిపై కూడా ఎందుకు కేసు పెట్టలేదు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను అరెస్ట్ చేయబోమని ఇటీవల రేవంత్ రెడ్డి చెప్పడం వెనుక ఆంతర్యమేంటో చెప్పాలని కోరారు. అవినీతి పరులను జైలులో పెట్టనప్పుడు, ఈ కమిషన్ నివేదిక, దానిపై అసెంబ్లీలో చర్చ ఎందుకని ప్రశ్నించారు. సభా సమయం వృధా చేయడం తప్ప ఉపయోగంలేదన్నారు. కేసీఆర్ పై ఉన్నట్లుండి రేవంత్ రెడ్డికి ఎందుకు ప్రేమ పుట్టిందో చెప్పాలి. లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగినా, కావాలనే నీర్చుగార్చడం దారుణమన్నారు. నేరం జరిగితే విచారణ జరగాలి, కానీ ఇలా చట్టసభలో పెట్టి, సమయం వృధా చేయడం వల్ల ఉపయోగం లేదన్నారు.