Hyderabad Fire Accident | హైదరాబాద్: నగరంలోని చందానగర్‌లో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రముఖ అను ఫర్నిచర్ (Anu Furniture) షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చందానగర్ లోని 'ట్విన్ టవర్స్' ఫర్నిచర్ మాల్‌లోని 5 అంతస్థుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మంటల ధాటికి ఒక టవర్ పూర్తిగా కాలిపోగా, లోపల ఉన్న భారీ ఫర్నిచర్ స్టాక్ అంతా బూడిదైపోయింది. కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
మంటల తీవ్రత ఎంతలా ఉందంటే, అవి పక్కనే ఉన్న నిర్మాణంలో ఉన్న భవనాలతో పాటు వెనుక వైపు ఉన్న 5 అంతస్థుల రాజు హాస్పిటల్ బిల్డింగ్‌కు కూడా వ్యాపించాయి. దీంతో చందానగర్ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో అలుముకున్నాయి. 7 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆస్తి నష్టం భారీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఫర్నిచల్ షాపులో ఉన్న సోఫాలు, బెడ్‌లు, టేబుల్స్, ఇతర వస్తువులు ఉండడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయి. దాంతోపాటు మంటలు త్వరగా అదుపులోకి రాకపోవడానికి కూడా అదే కారణమని ఫైర్ సిబ్బంది భావిస్తోంది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
