సీనియర్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఇటీవల ఆయనను కాంగ్రెస్ నుంచి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కొద్దిరోజులకే ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ నాయకులు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు అయినప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ అన్ని ఎన్నికలు ఓడిపోతూ వచ్చిందన్నారు. తెలంగాణలో పీసీసీ అధ్యక్షులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. పీసీసీ అధ్యక్షుడి పదవి కావాలంటే దాదాపు రూ.25 కోట్లు ఖర్చు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ తెలంగాణ వ్యవహరాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ పై కూడా శశిధర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో సోనియా గాంధీ పట్ల సానుకూలత వ్యక్తం చేసినప్పటికి మిగిలిన నాయకులపై విమర్శలు గుప్పించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు తనకు నచ్చడం లేదని, చాలా బాధతో తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడికి లేఖ రాస్తున్నానని, సోనియా గాంధీకి కూడా లేఖ రాశానన్నారు. పార్టీలో ప్రస్తుత పరిస్థితులను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. పార్టీలో పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల కోసం పని చేయడంలో కాంగ్రెస్ ఫెయిలైందని విమర్శించారు.
వైఎస్సార్ సీఏంగా ఉన్నప్పుడు ఇదే జరిగింది..
పార్టీ ఇన్ ఛార్జిలు పీసీసీ అధ్యక్షులకు దాసోహం అయిపోతున్నారని, హైకమాండ్‌కు ప్రతినిధులుగా వ్యవహరించాల్సింది పోయి పీసీసీ చీఫ్ చెప్పినట్లు నడుచుకుంటున్నారన్నారు. ఇప్పుడే కాకుండా గతంలో దివంగత వైఎస్సార్ సీఏంగా ఉన్నప్పుడు కూడా అప్పటి ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఇలాగే వ్యవహరించారన్నారు. ప్రస్తుతం డబ్బు ప్రభావం పెరిగిపోయిందన్నారు. సోనియాగాంధీ కూడా పార్టీలో పరిస్థితులను చక్కదిద్దలేక నిస్సహయత స్థితిలో ఉన్నారన్నారు. గతంలో ప్రజల పక్షాన పోరాడిన కాంగ్రెస్ ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. సీట్ల కేటాయింపులోనూ గతంలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలు అవలంభించిందన్నారు. కేసీఆర్‌కు తొత్తులు పార్టీలో చాలా మంది ఉన్నారని ఆరోపించారు. సీఏం కేసీఆర్‌తో చాలా మంది కాంగ్రెస్ నాయకులు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారంటూ విమర్శించారు.
మర్రి శశిధర్ రెడ్డి త్వరలోనే బీజేపీ చేరడం ఖాయమైంది. ఇటీవల ఆయన ఢిల్లీకి వెళ్లిన సమయంలో బీజేపీలో చేరనున్నారని ప్రచారం జరగగా, అవన్నీ వదంతులేనని కొట్టిపారేసిన మర్రి శశిధర్ రెడ్డి మరుసటి రోజే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణతో వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆయనపై చర్యలు తీసుకుంది టీపీసీసీ. పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించింది. ఈ క్రమంలో కొన్ని రోజుల్లోనే శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.