Maoists Latest News: మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్రం దూకుడుగా ముందుకెళుతోంది. ఆపరేషన్ కగార్ ప్రభావంతో మావోల ఉనికి ప్రశ్నవార్థకంగా మారే పరిస్దితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే మావోయిస్టుల అంతమే లక్ష్యంగా జరుగుతున్న ఎన్ కౌంటర్లు పూర్తిగా అబద్ధం అంటూ మావోయిస్టు పార్టీ బహిరంగా లేఖ ద్వారా కేంద్రం తీరును జనం బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. దంతెవాడ, బీజాపూర్ దండకారణ్యంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ తాజాగా విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది. 

దంతెవాడలో జరిగింది ఎన్ కౌంటర్ కాదు, మర్డర్: మావోయిస్టు పార్టీదంతెవాడ-బీజాపూర్ సరిహద్దులో మార్చి 31న జరిగిన ఎన్‌కౌంటర్ అబద్ధం. ముందుగా అరెస్టు చేసిన తర్వాతనే కామ్రేడ్ రేణుకను హత్య చేశారు. కార్పొరేట్ దోపిడిని సులభతరం చేయడానికే ఈ మారణకాండలు, హత్యలు జరుగుతున్నాయని అన్నారు. ఆదివాసీలు, విప్లవకారుల ఊచకోతలను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. దంతెవాడ-బీజాపూర్ జిల్లా సరిహద్దు ఇంద్రావతి నది ఒడ్డున మార్చి 31న జరిగిన ఎన్‌కౌంటర్‌లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ భాను అలియాస్ చైతే చనిపోయారని పోలీసులు, అధికారులు విడుదల చేసిన ప్రకటన అవాస్తవమన్నారు.

వాస్తవానికి, కామ్రేడ్ చైతే అనారోగ్యం కారణంగా బీజాపూర్ జిల్లా భైరామ్‌ఘర్ బ్లాక్‌లోని బెల్నార్ గ్రామంలోని ఒక ఇంట్లో ఒంటరిగా ఉందని వివరించారు. ఈ సమాచారాన్ని పోలీసులు తెలుసుకొని మార్చి 31 తెల్లవారుజామున 4 గంటలకు ఆ ఇంటిని చుట్టుముట్టి  చైతేను అరెస్టు చేశారని తెలిపారు. అరెస్టు జరిగిన ప్రదేశంలోనే ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు రెండు-మూడు గంటలపాటు విచారించారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఇంద్రావతి నది ఒడ్డుకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశారని ఆరోపించారు.

హత్య తరువాత ఎన్ కౌంటర్‌గా సృష్టించే ప్రయత్నం చేశారని లేఖలో ధ్వజమెత్తారు. మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కామ్రేడ్ చైతే మృతి చెందారని , అక్కడ ఒక INSAS రైఫిల్ దొరికినట్లు అబద్ధాలు చెప్పారని ఫైర్ అయ్యారు. కామ్రేడ్ రేణుక తప్పుడు ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది నిజమని అభిప్రాయపడ్డారు. 

మావోయిస్టులు రాసిన లేఖలో  ఏముందంటే.." మార్చి 25న సీనియర్‌ కామ్రేడ్‌, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యుడు కొమ్రేడ్‌ లంకేశ్వరపు సారయ్య అలియాస్‌ సుధీర్‌తోపాటు బొడ్గా గ్రామంలో కొంతమంది గ్రామస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామ్రేడ్ సుధీర్‌ను అదే స్థలంలో పోలీసు అధికారులు విచారించారు. ఉదయం 10 గంటలకు సుధీర్‌తో పాటు ఇద్దరు యువకులను తీసుకెళ్లి హత్య చేశారు. కానీ మావోయిస్టులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లోరూ. 25 లక్షల రివార్డుతో ఉన్న ఎస్‌జెసి సభ్యుడిని హతమార్చామంటూ పోలీసు అధికారులు తప్పడు ప్రచారం చేశారు. 

నిజానికి కామ్రేడ్ సుధీర్ ఇంద్రావతి ప్రాంతానికి చెందిన జనతన సర్కార్ గురూజీగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. అనారోగ్య కారణాలతో స్థానిక కార్మికుల సహకారంతో కొద్దిరోజులుగా అక్కడే ఉండిపోయాడు. జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు కామ్రేడ్ సుధీర్‌తో సహా ఈ కాగర్ డామన్ ప్రచారంలో అమరులైన సహచరులందరికీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తోంది. 

విప్లవకారుల త్యాగాలు వృథా కావు. బ్రాహ్మణ హిందుత్వ ఫాసిస్టుల కలలు సాకారం కావు. దేశాన్ని పాలిస్తున్న బ్రాహ్మణ హిందుత్వ ఫాసిస్టులు అణగారిన ప్రజలపై, వారి తరపున పోరాడుతున్న విప్లవకారులపై తీవ్ర అణచివేత, ప్రతి-విప్లవ యుద్ధాన్ని ప్రారంభించారు. దేశంలో విప్లవోద్యమాన్ని తుదముట్టించి, దండకారణ్య అడవుల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్న అపారమైన సహజ వనరులను దేశ, విదేశీ కార్పోరేట్ కంపెనీలకు విచ్చలవిడిగా ధారాదత్తం చేసి కార్పొరేట్ హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యంతో విప్లవకారులను, గిరిజనులను ఊచకోత కోస్తున్నారు. మృతదేహాలను లెక్కించే ఆట అక్రమంగా, అప్రజాస్వామికంగా, అమానవీయంగా కొనసాగుతోంది. 

అడవుల్లోని గిరిజన గ్రామాల నుంచి మృతదేహాలను ఎంత ఎక్కువగా తీసుకువస్తే అంత గొప్ప విజయం సాధిస్తామన్నారు. ఇదంతా మన దేశంలోని గౌరవనీయులైన నాయకులు, ఉన్నతాధికారులు అని చెప్పుకునేవారే చేస్తున్నారు. లొంగిపోలేకపోతే చంపేస్తాం’ అని బహిరంగంగా బెదిరిస్తున్నారు. ఏ రాజ్యాంగం, చట్టం ప్రకారం ఇలా చెబుతున్నారు, చేస్తున్నారు? అన్ని ప్రజాస్వామిక, ప్రగతిశీల, లౌకిక, విప్లవాత్మక సామాజిక సంస్థలు, వర్గాలు, వ్యక్తులు ఈ అణచివేతకు వ్యతిరేకంగా తమ గళాన్ని పెంచాలి. ఈ తప్పుడు ఎన్‌కౌంటర్‌తో సహా అన్ని సంఘటనలపై న్యాయ విచారణ కోసం పోరాడాలి. ఘటనా స్థలాన్ని సందర్శించి వాస్తవాలను ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా ఈ సంస్థలు, ప్రజల అనుకూల మీడియా సిబ్బందికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకోవాలని, దానిని బట్టబయలు చేయాలని, గిరిజనులు, విప్లవకారులపై జరుగుతున్న మారణహోమ హత్యలను అరికట్టాలని దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అడవులలో తీవ్రమైన అణచివేత కారణంగా, మేము అనేక ముఖ్యమైన అంశాలపై సకాలంలో ప్రతిస్పందన లేదా ప్రకటన ఇవ్వలేకపోతున్నాం" అని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ, మావోయిస్టు పార్టీ పేరుతో బహిరంగ లేఖ విడుదల చేశారు.  

కామ్రేడ్ గుమ్మడవెల్లి రేణుక అలియాస్ చైతే (55) స్వస్థలం తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామం. తిరుపతి నుంచి మొదటి డివిజన్‌లో ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత సాధించారు. దాదాపు 35 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో తన సేవలను అందించిన ఆమె క్లిష్టపరిస్థితుల్లో సైతం ఉద్యమంలో కొనసాగారు. అనారోగ్యంతో బాధపడుతున్నా పార్టీ ఇచ్చిన బాధ్యతలన్నింటినీ చివరి శ్వాస వరకు దృఢ సంకల్పంతో, చొరవతో నిర్వర్తించారు. కామ్రేడ్ రేణుక మొదటి నుంచి ఆమె బలిదానం వరకు తెలంగాణ, దండకారణ్య మహిళా విముక్తి ఉద్యమంలో ముఖ్యమైన, క్రియాశీల పాత్ర పోషించారు..