Hyderabad Crime News | హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిన వ్యక్తులు జరిమానా కడతారు. మొదట చాలా మంది తమను వదిలేయాలని కోరతారు. తాము తాగలేదని కొందరు బుకాయిస్తారు. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుటే నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
పీఎస్ ఎదుటే నిప్పంటించుకుని ఆత్మహత్య
మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మౌలాలి ప్రాంతంలో గల కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుట దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన సింగిరెడ్డి మీన్ రెడ్డి (32) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో మీన్ రెడ్డి తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది.
సింగిరెడ్డి మీన్ రెడ్డి దమ్మాయిగూడ నివాసిగా పోలీసులు గుర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో అతనికి బ్రీత్ అనలైజర్‌లో 120 రీడింగ్ వచ్చినట్లు కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే, పోలీసులు వ్యవహరించిన తీరుపై మనస్తాపం చెంది అతను ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
Continues below advertisement
పోలీసులు మీన్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Continues below advertisement