హైదరాబాద్: బీఆర్‌ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధం కాకపోతే... నవంబర్ 11వ తేదీ లోగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి... మాజీ సీఎం కేసీఆర్‌త పాటు హరీష్ రావు, కేటీఆర్‌ని అరెస్ట్ చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పర్టీలు పోటాపోటీగా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్‌కు మద్దతుగా రహమత్ నగర్ డివిజన్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొని బీఆర్‌ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు.
జూబ్లీహిల్స్‌కు కృష్ణా జలాలు తీసుకొచ్చిన పీజేఆర్
ఈ సందర్భంగా దివంగత నేత పీజేఆర్ (పి. జనార్దన్ రెడ్డి) కుటుంబానికి, నియోజకవర్గానికి జరిగిన అన్యాయాన్ని, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్యల విషయంలో బీజేపీ వైఖరిని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ నాయకులు సెంటిమెంట్ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పీజేఆర్‌తో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ, గతంలో ఈ ప్రాంతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉండేదన్నారు. ఇక్కడి బస్తీవాసుల తాగునీటి కష్టాలు తీర్చాలని ఆనాడు ఖాళీ కుండలతో పీజేఆర్ ధర్నా చేశారని గుర్తుచేశారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి కృష్ణా జలాలు తెచ్చి ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చిన గొప్పనేత పీజేఆర్ అని కొనియాడారు.
లక్షలాది పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన పేదోళ్ల దేవుడు పీజేఆర్ అని పేర్కొన్నారు. పీజేఆర్ కుటుంబానికి కేసీఆర్ అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2007 లో పీజేఆర్ ఆకస్మికంగా మరణిస్తే, టీడీపీ, బీజేపీ అభ్యర్థిని పెట్టకుండా ఆ కుటుంబాన్ని ఏకగ్రీవంగా నిలబెట్టేందుకు అండగా నిలబడ్డాయన్నారు. కానీ, కేసీఆర్ మాత్రం పీజేఆర్ కుటుంబంపై అభ్యర్థిని నిలబెట్టి మంచి సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. పీజేఆర్ సతీమణి కేసీఆర్‌ను కలిసేందుకు వెళితే, 3 గంటలు బయట నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలు పదే పదే చెప్పారు. కాళేశ్వరం కేసును సీబీఐకి పంపిస్తే 48 గంటల్లో తండ్రీ కొడుకులను జైలుకు పంపిస్తామన్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాపోతే.. వాళ్లది ఫెవికాల్ బంధం కాకపోతే... ఈ నెల 11 లోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసీఆర్, హరీష్, కేటీఆర్‌ని అరెస్ట్ చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు.
ఫార్ములా ఈ రేస్ (Formula E Race) కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? ఇందులో మీ చీకటి ఒప్పందం ఏంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ముందుగానే చీకటి ఒప్పందం చేసుకుని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు పరోక్ష మద్దతు ఇస్తోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని, ఇది నేను అంటున్నది కాదు... వాళ్ల ఆడబిడ్డ కవిత చెప్పిన మాటలే అని జూబ్లీహిల్స్ వాసులు, తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.