Revanth Reddy Unveils Statue of Rosaiah | హైదరాబాద్: హైదరాబాద్ లోని లక్డీకాపూల్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. కొణిజేటి రోశయ్య 92వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ సీఎంకు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తో పాటు రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. దివంగత కాంగ్రెస్ నేత, మాజీ ఆర్థిక మంత్రి రోశయ్య సేవలను స్మరిస్తూ రవీంద్రభారతిలో శుక్రవారం నాడు సభ నిర్వహిస్తున్నారు.
ఉదయం 10 గంటలకు గాంధీ భవన్ లో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్ లో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
గాంధీ భవన్‌లో వరుస సమావేశాలు..
అనంతరం ఉదయం 10.30 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరిగింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీలో ప్రాతినిధ్యంవహిస్తున్న కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కొందరు సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాత్రను తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తగ్గిస్తున్నారని సమావేశంలో చర్చ జరిగింది. తెలంగాణకు ఖర్గే రాక సందర్భంగా ఇచ్చిన పేపర్ యాడ్స్ లో మీనాక్షి నటరాజన్ లేకపోవడంపై సమావేశంలో చర్చకు వచ్చింది. మిగతా మంత్రులు, నేతలు ఇచ్చిన పేపర్ యాడ్స్, ఇతర పోస్టర్లలో మీనాక్షి నటరాజన్ ఫొటో ఉందని ప్రస్తవించారు. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.