KCR Admits in Hospital |హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గురువారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. రెండు రోజులనుంచి కాస్త నీరసంగా ఉండటంతో గురువారం సాయంత్రం కేసీఆర్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో చేరారు. కేసీఆర్ ఆరోగ్యంపై యశోద ఆసుపత్రి యాజమాన్యం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద డాక్టర్లు తెలిపారు. కేసీఆర్ షుగర్ లెవెల్స్ కాస్త పెరగగా, సోడియం లెవెల్స్ కాస్త తగ్గాయి. ప్రస్తుతం కేసీఆర్ కు షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌ చేసి, సోడియం లెవెల్స్‌ను పెంచుతున్నామని యశోద హాస్పిటల్ డాక్టర్ ఏంవీ రావు వెల్లడించారు.

కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆరోగ్యం గురించి తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అకస్మాత్తుగా కేసీఆర్ అనారోగ్యంతో యశోదా ఆసుపత్రిలో చేరారని తెలియగా ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు. యశోదా హాస్పిటల్ డాక్టర్లు, అధికారులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ప్రతిపక్షనేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్ కు మెరుగైన వైద్యం అందించే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు.

 

పోలీసుల తీరుపై ప్రశాంత్ రెడ్డి ఆగ్రహంబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాస్పిటల్ లో చేరారని తెలుసుకున్న బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ సోమాజిగూడ యశోద హాస్పిటల్‌కు వచ్చారు. గెల్లు శ్రీనివాస్ తో పాటు బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు, కిషోర్ గౌడ్, తదితరులను పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరుపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ ఉన్నందున బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు శాంతియుతంగా వ్యవహరించి నేతలకు సర్దిచెబితే సరిపోతుంది, కానీ దౌర్జన్యం చేయడం సరికాదంటూ మండిపడ్డారు.