Mallareddy University: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రచారాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ శివారులోని మల్లా రెడ్డి విశ్వవిద్యాలయం 30 వేల మంది విద్యార్థులతో మెగా ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంతో విశ్వవిద్యాలయం ప్రపంచ రికార్డును నెలకొల్పింది. అత్యధిక సంఖ్యలో విద్యార్థులు భారత జాతీయ జెండాను ఊపుతూ, 365 రోజులపాటు దేశభక్తి కలిగి ఉంటామనే ప్రతిజ్ఞ చేశారు ఈ మెగా ఈవెంట్ ను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కౌన్సిల్ రికార్డ్ చేసింది.
దేశం కోసం విద్యార్థులంతా ఏకమై..
30 వేల మంది విద్యార్థులు స్ఫూర్తిదాయకమైన ప్రతిజ్ఞ చేశారు. డాక్టర్ ప్రీతి రెడ్డి.. విద్యార్థులతో ఈ ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులను శక్తివంతం చేయడం, దేశం కోసం కృషి చేసేలా వారిని ప్రోత్సహించడమేనని ఈ కార్యక్రమం ప్రాథమిక ఉద్దేశ్యమని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
హరీశ్‌రావు, మల్లారెడ్డి, సహా..
తెలంగాణ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి టి. హరీష్ రావు, కార్మిక ఉపాధి, కర్మాగారాలు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మల్లా రెడ్డి, మల్లా రెడ్డి విశ్వవిద్యాలయం ఛైర్మన్ మహేందర్ రెడ్డి, డాక్టర్ భద్రారెడ్డి, ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి హెల్త్ సిటీ ఛైర్మన్, మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వీఎస్కే రెడ్డి తదితరులు హాజరు అయ్యారు.
అంతరిక్షంలోనూ ఎగిరిన మువ్వన్నెల జెండా..
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా వాడవాడలా త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయినవేళ ఘనంగా వేడుకలు నిర్వహించాలని ప్రధానమంత్రి పిలుపుతో ఇంటంట మువ్వన్నెల జెండా ఎగిరింది. 75 ఏళ్లు పూర్తై వజ్రోత్సవాలు చేసుకుంటున్న వేళ.. అంతరిక్షంలో అద్భుతం చోటు చేసుకుంది. భూ గ్రహం నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులో భారతీయ జాతీయ జెండా ఎగిరింది. స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ జాతీయ పతాకాన్ని అంతరిక్షంలో ఆవిష్కరించింది. యువ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ సంస్థ.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ.. హర్ ఘర్ తిరంగ ప్రచారంలో భాగంగా స్పేష్ కిడ్జ్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా వజ్రోత్సవాలను ప్రతిష్టాత్మంగా తీసుకుంది. 22వ తేదీ వరకు కార్యక్రమాలు చేపట్టింది.