Malkajgiri Mynampally vs Harish Rao: మేడ్చల్: తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావుపై మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు ఫైర్ అయ్యారు. హరీష్ రావు (Harish Rao) సహా మరికొందరు బీఆర్ఎస్ నేతలు తాము ఇంకా అధికారంలోనే ఉన్నామన్న భ్రమలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ సెటైర్లు వేశారు. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన అక్రమాల చిట్టా విప్పుతామన్నారు. మల్లన్న సాగర్ కుంభకోణంలో బినామీల పేర్లతో పాస్ బుక్ లు సృష్టించి మాజీ మంత్రి హరీష్ రావు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు.
తూముకుంట మున్సిపల్ పరిధిలోని అంతాయిపల్లి గ్రామంలో జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభా స్థలాన్ని స్థానిక మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వజ్రష్ యాదవ్ తో కలిసి మైనంపల్లి హన్మంతరావు ఆదివారం పరిశీలించారు. అనంతరం మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) లో కాంగ్రెస్ గెలవకపోవడం బాధగా ఉందన్నారు. మంచి చేస్తారని నమ్మి ప్రజలు బీఆర్ఎస్ కు ఓటువేసి మోసపోయారని చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి రావడం లేదు
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరగడమే మనేశారని విమర్శించారు. మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేస్తున్న ఒక మహిళను ఢిల్లీకి పంపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. ఎంపీగా గెలిపిస్తే అభివృద్ధి పూర్తి బాధ్యత తానే తీసుకుంటా అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపీగా గెలిపించుకుంటే అభివృద్ధి చేసి చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని గుర్తుచేశారు.
దళిత బంధు పథకం అందరికి ఇస్తామని చెప్పి, బీఆర్ఎస్ మనుషులకే డబ్బులు ఇచ్చి అందరికీ ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఊరుకు ఒక్క దళిత బంధు కూడా ఇవ్వలేదని చెప్పారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తరువాత టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని చెప్పి మాజీ సీఎం కేసీఆర్ మోసం చేశారని మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌ను గతంలో ఇబ్బంది పెట్టింది బీఆర్ఎస్
టీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చాలా ఇబ్బంది పెట్టారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 24 మంది టచ్ లో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు దొంగ మాటలు చెపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు విషయం ఏంటంటే లోక్ సభ ఎన్నికల తరువాత ఖాళీ అయ్యేది బీఆర్ఎస్ పార్టీ అని ఎద్దేవా చేశారు. అన్ని మతాలను గౌరవించే పార్టి కాంగ్రెస్ పార్టీ అని, ఈ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు గెలువబోతున్నమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత నక్క ప్రభాకర్ గౌడ్, కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బలేశ్, తుముకుంట మున్సిపాలిటీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.