Liquor Shops Closed In Hyderabad: మందుబాబులకు అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా మంగళవారం మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో హైదరాబాద్‌ అంతటా వైన్ షాప్స్ మూతపడనున్నాయి. హనుమాన్‌ జయంతి నేపథ్యంలో ఈ నెల 23న శోభాయాత్ర వైభవంగా నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలు నుంచి బుధవారం ఉదయం 6 గంటలు వరకు ఈ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పోలీస్‌ కమిషనర్‌ పేర్కొన్నారు. మద్యం దుకాణాలు మూసివేయడం ద్వారా ఘర్షణలు, వివాదాలకు ఆస్కారం లేకుండా చేయాలన్నది పోలీసులు ఆలోచనగా చెబుతున్నారు. 


గౌలిగూడ నుంచి సికింద్రాబాద్‌ వరకు యాత్ర.. 


హనుమాన్‌ శోభాయాత్ర గౌలిగూడలోని రామమందిర్‌ నుంచి సికింద్రాబాద్‌ తాడ్‌బంద్‌ హనుమాన్‌ ఆలయం వరకు జరగనుంది. ఈ శోభాయాత్రను భజరంగ్‌దళ్‌, విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించనున్నారు. శోభాయాత్ర ఏర్పాట్లు, రూట్‌మ్యాప్‌ను ఇప్పటికే పోలీస్‌ కమిషనర్‌ పరిశీలించారు. ఈ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.