Rohit Vemula Case Re-open: హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థి రోహిత్ వేముల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు రోహిత్ ది ఆత్మహత్యగా తేల్చారని, ఎలాంటి సాక్ష్యాలు సేకరించలేకపోయారని, కేసు మూసివేసినట్లు శుక్రవారం ప్రచారం జరిగింది. పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఆత్మహత్యకు సంబంధించిన కారణాలు, ఎవిడెన్స్ ఏమి లేవని కోర్టుకు నివేదిక ఇచ్చారు పోలీసులు. రోహిత్ వేముల దళితుడే కాదని సైతం క్లోజింగ్ రిపోర్ట్ లో పేర్కొన్నట్లు వైరల్ అయింది. అయితే ఈ కేసుపై రోహిత్ తల్లి అనుమానాలు వ్యక్తం చేయడం, హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళనతో తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రోహిత్ వేముల కేసును పునర్విచారణ చేయాలని డీజీపీ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు పునర్ విచారణకు అనుమతి కోరుతూ పోలీస్ శాక కోర్టులో పిటిషన్ వేయనుంది. కాగా, 2016లో వర్సిటీ క్యాంపస్ లో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.


తెలంగాణ డీజీపీ రియాక్షన్..
2016 జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య పై సైబరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.20/2016 కు సంబంధించి శుక్రవారం నాడు (మే 3న) పలు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ఛానళ్లలో రకరకాల వార్తలు, కథనాలు ప్రచారం కావడంపై తెలంగాణ డీజీపీ రవిగుప్తా స్పందించారు. రోహిత్ వేముల కేసులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మాదాపూర్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన తుది నివేదికను గత సంవత్సరం.. నవంబర్ 2023 కన్నా ముందే నిర్వహించిన దర్యాప్తు ఆధారంగా తయారు చేశారని తెలిపారు.






 


ఆ తుది నివేదికనే అధికారికంగా 21.03.2024న ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సంబంధిత కోర్టులో దాఖలు చేశారని స్పష్టం చేశారు. అయితే కేసు విచారణపై, విచారణ జరిగిన విధానంపై రోహిత్ వేముల తల్లితో పాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో ఈ కేసును మళ్లీ విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఈ కేసుపై తదుపరి దర్యాప్తును అనుమతించాలని మేజిస్ట్రేట్‌ను అభ్యర్థిస్తూ సంబంధిత కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు.