Kaleshwaram: తెలంగాణలో అతిపెద్ద భారీ సాగునీటి ప్రాజెక్టు కాలేశ్వరం, ఆది నుంచి ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంది. కేసీఆర్ హాయంలో లక్షా నలభై ఏడు వేల కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టలు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోందని, బీడువారిన పంటలను , పచ్చని ఆదాయ సిరులుగా మార్చిందని బీఆర్ ఎస్ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టిన నాటి నుంచి కాలేశ్వరం టార్గెట్‌గా ముందుకు వెళుతోంది. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం వేల కోట్లు దొచుకున్నారని, ఆ లెక్కలు తేలుస్తామంటూ ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ చివరి దశకు చేరకుంది. కాలేశ్వరం కమిషన్ అప్పటి అధికారులను, మంత్రులను విచారించి ,చివరిగా గత ముఖ్య మంత్రి కేసీఆర్ ను విచారించి, నివేదిక సిద్దం చేస్తోంది.

ఇదిలా ఉంటే కాలేశ్వరం అవినీతిపై రంగంలోకి దిగిన ఏసిబి అధికారులు కాలేశ్వరం నిర్మాణ సమయంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో అధికారులు సైతం ఆశ్చర్యపోయేంతలా అక్రమ ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోంది. ఏసిబి వెంట మేముసైతం అంటూ తాజాగా ఈడీ ఎంట్రీతో కాలేశ్వరం ఇంజనీర్ల అవినీతి బాగోతం తారాస్దాయికి చేరుకుంది. 

కాలేశ్వరం ప్రాజెక్టునిర్మాణంలో అతి పెద్ద తిమిగలం ఇంజనీరింగ్ ఛీఫ్ మురళీధరరావుగా అధికారులు గుర్తించారు. మురళీధరరావు ఇంటితోపాటు 12చోట్ల ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో ఏకంగా వెయ్యి కోట్ల ఖరీదు చేసే 11 ఎకరాల భూమిని గుర్తించారు ఏసిబి అధికారులు. కొండాపూర్ లో విల్లా, బంజారాహిల్స్ లో ఫ్లాట్, బేగంపేటలో ఫ్లాట్ , కోకాకపేటలో ఖరీదైన ఫ్లాట్, యూసఫ్ గూడలో ఫ్లాట్, మోకిలాలో 6500 గజాల ఖరీదైన ఫ్లాట్, ఇవికాక వరంగల్, కరీంనగర్ ఫ్లాట్‌లు, ఓ బెంజ్ కారు ఉన్నట్లు ఏసిబి అధికారుల గుర్తించారు. దీనికి తోడు మురళీధరరావు కొడుకు అభిషేక్ రావు కంపెనీలకు కాలేశ్వరం నిర్మాణ సమయంలో పెద్దఎత్తున పెట్టుబడులు రావడంపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మురళీధర్ రావును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు అధికారులు.

కాలేశ్వరం మాజీ ఇంజనీరింగ్ చీఫ్‌ భూక్యా హరిరామ్ సైతం ఏసిబి అధికారులకు అడ్డంగా దొరికారు. హరిరామ్ ఇంటితోసహా 14 చోట్ల సోదాలు నిర్వహించారు ఏసిబి అధికారులు.షేక్‌పేట్, కొండాపూర్‌లొో లగ్జరీ విల్లాలు, శ్రీరామ్ నగర్, మాదాపూర్, నార్సింగ్ లలో మూడు ఫ్లాట్లు , అమరావతిలో కమర్షియల్ ల్యాండ్ ,సిద్దిపేట జిల్లా మర్కూక్ లో 28 ఎకరాల వ్యవసాయ భూమలతోపాటు పఠాన్ చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో రెండు ఇళ్లు, బొమ్మల రామారంలో ఆరు ఎకరాల ఫామ్ హౌస్, కొత్త గూడెలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు. ఇలా మొత్తంగా 300 కోట్లు విలువైన అక్రమాస్తులు కాలేశ్వరం ద్వారా సంపాదించాడని ఏసిబి అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో 48,665 కోట్ల రూపాయల పనులు హరిరామ్ పర్యవేక్షణలోనే జరగడంతో అడ్డగోలుగా ఆస్తులు కూడగట్టుకున్నాడు. అవినీతి సొమ్ము భారీగా గుర్తించిన ఏసిబి అధికారులు భూక్యా హరిరామ్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 

కాలేశ్వరం నిర్మాణంలో ఈఈగా పని చేసిన నూనె శ్రీధర్ తానేమీ తక్కువ తినలేదంటూ నిరూపించారు. శ్రీధర్ కొడుకు పెళ్లిని థాయ్ ల్యాండ్ లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందు కోసం పెద్ద ఎత్తున ఖర్చుపెట్టినట్లుగా సమాచారం అందుకున్న ఈడీ అధికారులు నూనె శ్రీధర్ అక్రమాస్తులపై దృష్టి సారించారు. శ్రీధర్ ఇంటితోపాటు 14చోట్ల వరుస దాడులు నిర్వహించిన ఏసిబి అధికారులు సుమారు 60 కోట్ల విలువైన అక్రమాస్తులను, అనేక విల్లాలు, ఫ్లాట్లు ,ఖరీదైన కార్లు గుర్తించారు. మొత్తంగా కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఈఈ శ్రీధర్ దోచుకుని దాచుకున్న ఆస్తుల విలువ బహిరంగా మార్కెట్ లో 150కోట్లకుపైగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. 

ఇలా తవ్వుతున్నకొద్ది కాలేశ్వరం ప్రాజెక్టులలో అధికారుల రూపంలో పని చేసిన అవినీతి జలగలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాలేశ్వరం ప్రాజెక్టును అడ్డుపెట్టుకుని ఇంకా ఎక్కడెక్కడ అక్రమాస్తులు సంపాదించారు, విదేశాలకు ఎంత మొత్తంలో తరలించారు. బినామీ అకౌంట్లలోకి ఎన్ని కోట్లు పంపారనే వివరాలను ఇవ్వాలంటూ ఏసిబిని కోరింది ఈడీ.  సీన్ లోకి ఈడీ ఎంట్రీతో మరింత మంది కాలేశ్వరం అవినీతి తిమింగలాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.