బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వామపక్షాల ఊసే ఎత్తకపోవడం అందరినే కాక ఆ పార్టీల వారికి ఆశ్చర్యం కలిగించిన సంగతి తెలిసిందే. కొద్ది నెలల  క్రితం జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు.. కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికలకు కూడా కలిసే వాళ్తారని అనుకున్నారు. కానీ, నిన్నటి ప్రెస్ మీట్ లో మాత్రం ఒంటరిగానే ఎన్నికల్లోకి వెళ్లబోతున్నట్లుగా తేటతెల్లం అయింది. వామపక్షాలతో పొత్తు లేదనే విషయాన్ని సీఎం కేసీఆర్ చెప్పకనే చెప్పేశారు.


ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ తీరును తప్పుబట్టారు. ఆయన తమను అవసరానికి వాడుకున్నారని అన్నారు. మునుగోడులో తమ అవసరం కేసీఆర్ కు ఉన్నందున పిలిపించారని, తాము కూడా బీజేపీని ఓడించాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చామని తెలిపారు. రాజకీయాల్లో మోసం చేసే వాళ్లు ఉంటారని అన్నారు. తాము బీఆర్‌ఎస్‌ను నమ్ముకొని లేమని వెల్లడించారు. వచ్చే ఎన్నికల కోసం తమతో ఎవరైనా కలిసొస్తే పోటీ చేస్తామని.. లేకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని అన్నారు. 


కేసీఆర్ మొండి చేయి చూపించడంతో కమ్యూనిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న, మొన్నటి దాకా పొత్తులపై చర్చలు జరిపి, తీరా ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంపై తప్పుబడుతున్నారు. సీఎం కేసీఆర్ అవకాశ వాది అని అంటున్నారు. దీంతో నేడు (ఆగస్టు 22) వామపక్షాలు సమావేశం కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లో సీపీఐ, సీపీఎంలు ఉమ్మడిగా సమావేశమై కార్యచరణపై చర్చించనున్నాయి. సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేసే యోచనలో ఉన్నాయి. ఒకవేళ రెండు పార్టీలు కలిసినా అన్ని చోట్లా పోటీచేసే పరిస్థితి లేదు. ఈ క్రమంలో పోటీ చేయని చోట కమ్యూనిస్టులు ఎవరికి మద్దతిస్తారని ఆసక్తిగా మారింది.


సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా కలిసేపోటీ చేస్తాయని.. ప్రజాతంత్ర పార్టీలతో కలిసి ఎన్నికలకు సిద్ధమవుతామని అన్నారు. ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది త్వరలో ప్రకటిస్తామని కూనంనేని సాంబశివరావు తెలిపారు.