KTR Travel by Auto From Yousufguda To Telangana Bhavan: హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం ముగించుకొని అనంతరం తెలంగాణ భవన్ వరకు ఆయన ఆటోలో వెళ్లారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి కార్యక్తల సమావేశం నిర్వహించాలని బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) ఇదివరకే నిర్ణయించింది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం యూసుఫ్‌గూడలో జరిగింది. ఇందులో పాల్గొన్న కేటీఆర్(KTR) కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం
మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంశంపై తెలంగాణ ప్రభుత్వాన్ని మొదట్నుంచీ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్. కార్యకర్తల సమావేశం అనంతరం కారుకు బదులుగా ఆటోలో బయలుదేరి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. భద్రతా సిబ్బంది సైతం ఆటోలోనే కేటీఆర్ ను ఫాలో అయ్యారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆటో కార్మికుల పరిస్థితిపై ఇటీవల వీలు దొరికనప్పుడల్లా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టడం ఆటోవాలాల జీవితాన్ని తలకిందులు చేసిందన్నారు కేటీఆర్. కొన్ని రోజుల కిందట ఆటో కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామని, ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని కేటీఆర్ ఇటీవల డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు అండగా నిలవడంలో భాగంగా ఆటోలో ప్రయాణించి వారికి మద్దతు తెలిపారు. ఆయన వెంట జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉన్నారు.
ఆటోల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తారా?
మార్గమధ్యంలో ఆటో డ్రైవర్ల సమస్యలు, కష్టాలు అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. చాలా ఇబ్బందుల్లో ఉన్నాము, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మాజీ మంత్రి కేటీఆర్‌ను ఆ ఆటో డ్రైవర్ కోరారు. ఆటోల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి ప్రభుత్వం తమకు రీయంబర్స్ చేస్తే బాగుంటుందని ఆటో డ్రైవర్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకొస్తామని కేటీఆర్ చెప్పారు.
దావోస్ లాంటి విదేశీ పర్యటనలు, తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు, టెక్ ప్రతినిధులతో పెట్టుబడుల కోసం గత తొమ్మిదిన్నరేళ్లు టైమ్ కేటాయించిన కేటీఆర్ ఒక్కసారిగా ఆటోలో ప్రయాణించడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కేటీఆర్ ఆటోలో ప్రయాణించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలతో ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆటో కార్మికులు, ప్రైవేట్ వాహనదారులు, క్యా్బ్ డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.