KTR responds over bitter experience of Milla Magee | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ ఈవెంట్ నిర్వహణతో మన బ్రాండ్ ప్రపంచ వ్యాప్తంగా మార్మోగబోతుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ ఇంగ్లాండ్‌కు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్ మిల్లా మ్యాగీ తనను వేశ్యలా చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మిస్ వరల్డ్ లాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొనేందుకు వచ్చినా, మధ్యలోనే వైదొలిగి ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మిల్లా మ్యాగీ చేసిన సంచలన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.  

మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ వేదికలపై మహిళల పట్ల వివక్షాపూరిత ఆలోచనలు ఉన్న వారిని, వ్యవస్థను ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలన్నారు కేటీఆర్. ఈ విషయంలో ఇంగ్లాండ్‌కు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్ మిల్లా మ్యాగీ ఓ బలమైన మహిళగా నిలిచారు. మా తెలంగాణ రాష్ట్రంలో మీరు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేం చింతిస్తున్నాం అన్నారు.  

వాస్తవానికి తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలు ఉన్నాయి. మా రాష్ట్రంలో మహిళలను పూజిస్తాం, గౌరవిస్తాం, వారి అభివృద్ధికి సమాన అవకాశాలను కల్పిస్తాం. రాణి రుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి ధీర వనితలు పుట్టింది మా తెలంగాణ మట్టిలోనే. దురదృష్టవశాత్తూ మీరు (మిల్లా మ్యాగీ) ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేది కాదు. .

మీరు ఈ బాధ నుంచి త్వరగా రికవర్ కావాలని కోరుకుంటున్నాం. ఏ ఒక్క మహిళ, ఆడపిల్ల గానీ ఇలాంటి భయానక అనుభవాలను ఎదుర్కోకూడదని ఒక అమ్మాయి తండ్రిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాధితురాలిని విమర్శించడం, ఆమెను తప్పుగా చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే సమయంలో తెలంగాణలో తనకు జరిగిన చేదు అనుభవంపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని’ బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.

అందాల పోటీలు మంచివి కావు, వారిని కించపరచడమే..

తెలంగాణ ప్రభుత్వం పట్ల అందాల పోటీలో పాల్గొనేందుకు వచ్చి తిరిగి స్వదేశానికి వెళ్లిపోయిన మిస్ ఇంగ్లండ్ చేసిన సంచలన ఆరోపణలపై సీపీఐ నారాయణ స్పందించారు. వాస్తవానికి అందాల పోటీలు మంచివి కావు, ఆడవారిని కించపరిచే విధంగా ఈ పోటీలు ఉంటాయని చెప్పినందుకు కొందరు నాపై తీవ్ర విమర్శలు చేశారు. నేను ఎందుకు అలా మాట్లాడనో ఇప్పుడైనా అర్థమైందా అని సీపీఐ నారాయణ ప్రశ్నించారు.