ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శ‌నివారం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2, ఓఆర్​ఆర్​, రింగ్ రైల్వే ప్రాజెక్ట్ తదితర పనులకు సంబంధించి అంశాలను చర్చించారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపాలని కోరారు. ఫేజ్-1ను రూ. 22,000 కోట్లతో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల పరిధిలో నిర్మించామని, ఫేజ్–2లో భాగంగా మెట్రోను నగరంలోని ఇతర ప్రాంతాలకు త‌క్ష‌ణం విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఉందన్నారు. గత పదేళ్లు పాలించిన బీఆర్​ఎస్​ ఎలాంటి విస్తరణ చేపట్టలేదని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఫేజ్-2 విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించినట్లు చెప్పారు. 

హైదరాబాద్​ మెట్రో ఫేజ్–2 పనులు త్వరగా చేపట్టాలని మోదీని రేవంత్​ రెడ్డి కోరారు. ప్రాజెక్టులో మొత్తం 5 కారిడార్లు ఉంటాయని, మొత్తం 76.4 కి.మీ. పరిధిలో నిర్మిస్తామన్నారు. ఇందుకు మొత్తం రూ. 24,269 కోట్లు ఖర్చవుతుందని, కేంద్రం వాటా 18 శాతం (రూ. 4,230 కోట్లు), రాష్ట్రం వాటా 30 శాతం (రూ. 7,313 కోట్లు)  రుణం 48 శాతం (రూ. 11,693 కోట్లు) ఉంటుందని తెలిపారు. 

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-2కు  సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 2024లో నవంబరు 4న కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు స‌మ‌ర్పించిందని, వాటిపై కేంద్రం కొన్ని స్పష్టీకరణలు కోరగా సమాధానాలు ఇచ్చినట్లు రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. 2024 అక్టోబ‌రులో చెన్నై మెట్రో ఫేజ్‌-2కు (రూ. 63,246 కోట్లు), 2021, ఏప్రిల్‌లో బెంగళూరు మెట్రో ఫేజ్-2 (రూ. 14,788 కోట్లు), 2024, ఆగ‌స్టులో బెంగ‌ళూర్ మెట్రో ఫేజ్-3కు (రూ. 15,611 కోట్లు) ఆమోదం తెలిపిన విషయాన్ని మోదీకి గుర్తుచేశారు.

ఆర్​ఆర్​ఆర్​ ఉత్తర భాగం పనులు పూర్తయేలా చూడండి హైదరాబాద్ చుట్టూ రెండు జాతీయ రహదారులతో ప్రాంతీయ రింగు రోడ్డును (ఆర్ఆర్ఆర్‌) తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూముల సేకరణ 2022లో ప్రారంభమైందని, భూ సేక‌ర‌ణ వ్యయంలో రాష్ట్రం 50 శాతం భరిస్తోందని చెప్పారు. 90 శాత భూముల ప్రపోజల్స్ ను నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా (NHAI)కి పంపగా.. టెండ‌ర్లు పిలిచిందని, ఈ భాగానికి అవ‌స‌ర‌మైన ఆర్థిక సాయంతోపాటు కేబినెట్ ఆమోదం ఇవ్వాలని కోరారు. 

ఉత్తర భాగం, దక్షిణ భాగం పనులను ఏకకాలంలో చేప‌ట్టాలిఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంతో పాటు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం పనులను ఏకకాలంలో చేప‌ట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్ ఉత్త‌ర భాగం పూర్త‌యిన త‌ర్వాత ద‌క్షిణ భాగం నిర్మాణం చేప‌డితే భూ సేక‌ర‌ణ‌, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్ర‌మాదం ఉందని, అందుకే రెండు భాగాలను ఒకేసారి పూర్తిచేస్తేనే సరైన ఉపయోగం ఉంటుందని ప్రధానికి వివరించారు. ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం భూ సేక‌ర‌ణ‌కు అయ్యే వ్య‌యంలో 50 శాతం భ‌రించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉందన్నారు.  

రింగ్ రైల్వే ప్రాజెక్ట్ ప్రస్తావనరీజిన‌ల్ రింగు రోడ్డుకు స‌మాంత‌రంగా 370 కిమీ పరిధిలో రైల్వే లైన్ ప్రతిపాదించామని రేవంత్​ రెడ్డి తెలిపారు. ఇది రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశలో మార్గం చూపుతుందని పేర్కొన్నారు. బందరు పోర్టు నుంచి హైద‌రాబాద్ డ్రైపోర్ట్ వ‌ర‌కు గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరు చేయాలని కోరారు. బందరుపోర్ట్–డ్రైపోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే స‌ర‌కు రవాణా ఖర్చు తగ్గించ‌డంతో పాటు ఎగుమతులకు ద‌న్నుగా నిలుస్తుందని, త‌యారీ రంగానికి ప్రోత్సాహ‌కంగా ఉండి కొత్త ఉద్యోగాల‌ను సృష్టిస్తుందని పేర్కొన్నారు.

సెమీకండక్టర్ రంగానికి మద్దతివ్వండి..తెల‌పండి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM)కు తెలంగాణ పూర్తి మద్దతిస్తోందని.. తెలంగాణ ఐఎస్​ఎం ప్రాజెక్ట్‌కు కేంద్రం ఆమోదం తెలపాలని కోరారు. హైదరాబాద్‌లో AMD, Qualcomm, NVIDIA వంటి R&D కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. పరిశ్రమలకు స్థలాలు, నైపుణ్యం గల మానవ వనరులు, మౌలిక సదుపాయాలు హైద‌రాబాద్‌లో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. 

రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతివ్వాలిహైద‌రాబాద్‌లో ప్ర‌భుత్వ‌, ప్ర‌భుత్వ‌–ప్రైవేట్​ సంయుక్త భాగ‌స్వామ్యంలో ఎంఎస్ఎంఈల్లో ఉన్న ర‌క్ష‌ణ రంగ ప్రాజెక్టుల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైద‌రాబాద్‌లోని DRDO, డిఫెన్స్ PSUలు ఉన్నత స్థాయిలో పని చేస్తున్నాయని, వాటి ప‌రిధిలో వెయ్యికి పైగా MSMEలు, స్థానిక, అంతర్జాతీయ డిఫెన్స్ సంస్థలకు విడి భాగాలు తయారు చేస్తున్నాయని ప్రధానికి వివరించారు. Lockheed Martin, Boeing, GE, Safran and Honeywell వంటి సంస్థలు హైదరాబాద్ పై ఆస‌క్తి చూపుతున్నాయని తెలిపారు.  ర‌క్ష‌ణ రంగంలోని JVs & Offsetలకు కేంద్ర ఆర్డర్లు త‌క్ష‌ణ అవసరమని, ఆమోదం తెలిపేందుకు ప్ర‌త్యేక‌ వ్య‌వ‌స్థ ఉండాలన్నారు. 

హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ప్రతిపాదనఆయా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణ‌కు కేంద్రం మద్దతివ్వాలని ప్రధానిని కోరారు. ఉత్తర్​ప్రదేశ్​, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కి ప్రోత్సాహం ఉంది కానీ హైదరాబాద్‌కు లేదని అన్నారు. ర‌క్ష‌ణ రంగ ప‌రిక‌రాల త‌యారీలో ముందున్న హైద‌రాబాద్‌లో  డిఫెన్స్ ఎక్స్‌పో నిర్వ‌హించాలని కోరారు. MSMEలకు ప్రోత్సాహకాలు, పీఎల్ఐ లాంటి మద్దతులు ఇవ్వాలని కోరారు.