KTR Vs Revanth Reddy | హైదరాబాద్: 18 నెలలుగా రాష్ట్రంలోని 70 లక్షల రైతులు, కోట్లాది ప్రజలను నోటికొచ్చిన హామీలతో మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మొత్తం 420 హామీలిచ్చి, రచ్చ చేశారు కానీ చర్చకు రమ్మంటే పరార్ అవుతారని సెటైర్లు వేశారు. కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ఆ సవాల్ స్వీకరించడంతో పాటు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం 11 గంటలకు చర్చకు రావాలని సూచించాం. మాట మీద నిలబడని నేత రేవంత్ రెడ్డి కనుక ప్రెస్ క్లబ్ లో మేం హాల్ బుక్ చేసి చర్చకు రమ్మని పిలిస్తే ఏ నేత కూడా రాలేదన్నారు.

ఏ బేసిన్ ఏ నదిలో ఉందో కూడా తెలియని నేత తెలంగాణ ముఖ్యమంత్రా అని జనం నవ్వుకుంటున్నారు. నీళ్లు , నిధులు, నియామకాలు తెలంగాణ నినాదం. వీటిని రేవంత్ రెడ్డి ఎలా ఫాలో అవుతున్నాడంటే.. ఏపీ సీఎం చంద్రబాబుకు కృష్ణా, గోదావరి నీళ్లు ఇస్తున్నాడు. కోవర్టు పాలన నడుస్తోంది. నీళ్లు ఆంధ్రాకు పోతే, నిధులు ఢిల్లీకి పోతున్నాయి. నియామకాలు ఆయన తొత్తులకు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఢిల్లీ పర్యటనపై ఓ కాంగ్రెస్ నేతతో మాట్లాడాను. రేవంత్ ఢిల్లీ ఎందుకు పోయాడని అడిగితే ఎరువుల బస్తాల కోసం ఢిల్లీకి వెళ్లాడని తెలిసింది. దూడకు గడ్డెయ్యాలని వెనుకటికి ఒకడు తాటిచెట్టు ఎక్కాడంట. రేవంత్ ఏ బస్తాలు తీసుకుని ఢిల్లీకి పోతున్నాడు. ఆయన ఓ పేటీఎం. పేమెంట్ కోటాలో సీఎం పదవి తెచ్చుకున్నాడు. రైతులు, మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, యువతపై ప్రేమ లేదు. హామీలు అమలు చేస్తలేదు. 

కొడంగల్ లో కూడా రైతు భరోసా పడలేదు..

రైతు బంధు అయిపోయిందన్నారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గం కోడంగల్ లో 670 మంది రైతులకు రైతు భరోసా రాని వారి జాబితా ఇదీ. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న 600 మంది రైతుల వివరాలు మేం వెల్లడిస్తున్నాం. ఎరువుల కొరతతో రైతులు అల్లాడుతున్నారు. ఒక్క ఆధార్ కు ఒక్క బస్తా ఇస్తాడంట. గత రోజులు తెస్తామన్నాడు. నిజంగానే కరెంట్ కోత, ఎరువులు, విత్తనాల కోసం లైన్లలో నిల్చునే రోజులు తెచ్చాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు, అణచివేతలు, ఎమర్జెన్సీని గుర్తుకుతెచ్చేలా పాలన చేస్తున్నాడు. నల్లబాలు అనే సోషల్ మీడియా వ్యక్తి ప్రశ్నించాడని కేసు పెట్టి అరెస్ట్ చేశారు. 

కేసీఆర్ హయాంలో రుణమాఫీ జరిగింది. పంట కాలానికి ముందే రైతు బంధు నగదు ఏ ఇబ్బంది లేకుండా వారి ఖాతాల్లో జమచేశాం. ఇప్పుడు మళ్లీ పైరవీల పాలన వచ్చింది. రైతుల ఆత్మహత్యలతో కూడా రేవంత్ రెడ్డి చలించడం లేదు. వర్షాకాలం వచ్చినా పంపు హౌజ్ లు బోర్లు ఆన్ చేసి నీళ్లు వదలడం లేదు. రైతులు కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. ఈరోజు చర్చకు రాకపోయినా ఎప్పుడు చర్చకు వస్తారో డేట్, ప్లేస్ చెప్పాలని ’ మరోసారి ఛాలెంజ్ చేశారు కేటీఆర్.