హైదరాబాద్: రైతుల సమస్యలపై బహిరంగ చర్చకు రావాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్ నేపథ్యంలో బహిరంగ చర్చకు బయలుదేరేందుకు కేటీఆర్ తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. అటు నుంచి బీఆర్ఎస్ నేతలతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వెళ్లనున్నారు. బహిరంగ చర్చ కోసం కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొందరు 11గంటలకు ప్రెస్ క్లబ్ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి పరస్పరం ఛాలెంజ్ ల దృష్ట్యా సోమాజీగూడ ప్లెస్ క్లబ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అసెంబ్లీలో చర్చకు రావాలన్న రేవంత్ రెడ్డి
రైతులకు తమ ప్రభుత్వం ఎంతో చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అంటున్నారు. రైతు భరోసా నగదు రైతుల ఖాతాల్లో వేసి వారికి పంట సాయం చేశామన్నారు. ఏడాది కాలంలోనే రైతులకు 2 లక్షల మేర రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమదే నని రేవంత్ రెడ్డి అన్నారు. కేటీఆర్ కాదు కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు రావాలని.. ఏ విషయం అయినా చర్చకు సిద్ధమేనని మంత్రులు స్పష్టం చేశారు. అసెంబ్లీకి వస్తే ప్రత్యేక చర్చకు తాము సిద్ధమేనని, ఏ అంశంపై అయినా బదులిస్తామని కాంగ్రెస్ అంటోంది.
రేవంత్ రెడ్డి పారిపోయిండా..
సీఎం రేవంత్ రెడ్డి చర్చకు వచ్చే అవకాశం లేదని మీడియా చెప్పగా.. అంతే అంటారా పారిపోయిండా ఏంటి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఇప్పటికీ నాలుగైదుసార్లు బహిరంగంగా చర్చకు సిద్ధం అన్నారు. మైక్ కట్ చేయకుండా అసెంబ్లీలో మా వాయిస్ వినిపిస్తామని చెబితే చర్చ పెట్టరు. ఒకవేళ చర్చ మొదలుపెడితే నాలుగు సెకన్లు కూడా మైక్ ఇవ్వరు. కేసీఆర్ వస్తరా, కేటీఆర్ వస్తారా.. రైతు సంక్షేమంపై చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు. రేవంత్ సవాల్ ను అదేరోజు స్వీకరించాను. నీ స్థాయికి కేసీఆర్ అవసరం లేదు. నేను చాలు అని చెప్పారు. అసెంబ్లీలో అయినా, ప్రెస్ క్లబ్, సెక్రటేరియట్, జూబ్లీహిల్స్ లో ఇంటికి రమ్మంటే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామని చెప్పాం. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తామని చెప్పి మాట తప్పిన నేత రేవంత్ రెడ్డి. సొంత నియోజకవర్గంలో ఓటమి తరువాత వెంటనే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి మాట తప్పిన వ్యక్తి. అందుకే మేం ప్రెస్ క్లబ్ లో హాల్ బుక్ చేసి పెట్టాం చర్చకు రమ్మని చెప్పాం.
రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఛాలెంజ్ చేశారు కనుక చర్చకు వస్తారని భావించాం. రేవంత్ లేని పక్షంలో వ్యవసాయశాఖ పై మాట్లాడేందుకు బాధ్యత తీసుకుని ఏ మంత్రి వస్తారో రండి. రైతులకు బీఆర్ఎస్ ఏం చేసిందో, కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై లెక్కలతో సహా వివరిస్తాం. అసెంబ్లీలో చర్చకు ఇష్టపడకపోవడానికి కారణం ఏంటంటే.. బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతుంటే మైక్ కట్ చేస్తారు. అందుకే ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశాం’ అని కేటీఆర్ అన్నారు.