Sigachi Blast Incident | సంగారెడ్డి: పటాన్‌చెరు మండలం పాశమైలారంలో జూన్ 30న జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సిగాచి కెమికల్స్ పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య  44కి చేరింది. బీరంగూడ పనేషియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరిఫ్ అనే కార్మికుడు మృతిచెందాడు. పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అఖిలేష్ అనే కార్మికుడి చనిపోయాడు. దృవ ఆస్పత్రిలో ఇప్పటివరకు నలుగురు కార్మికులు మృతిచెందారని అధికారులు తెలిపారు. పలు ఆస్పత్రుల్లో ఇంకా 16 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు.

నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (NDMA) బృందం నేడు సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని సిగాచీ పరిశ్రమకు రానుంది. ఘటనా స్థలాన్ని ఎన్డీఎంఏ టీం పరిశీలించనుంది. పేలుడు ఘటనకు కారణాలపై బృందం పరిశీలించి, అధికారులను వివరాలు ఆరా తీయనుదని సమాచారం. సహాయక చర్యలు కొనసాగిన తీరును అడిగి తెలుసుకుంటారు.

సిగాచీ కర్మాగారంలో పేలుడు ఘటనకు భద్రతా ప్రమాణాల వైఫల్యం ఉందని తెలుస్తోంది. భవన నిర్మాణ పటిష్టతతోపాటు పలు విషయాలను మేనేజ్ మెంట్ చూసీచూడనట్లు వ్యవహరించినట్లు హైలెవెల్ కమిటీ గుర్తించింది. అయితే తనిఖీ చేసే టీమ్స్ మాత్రం ఇక్కడ అంతా బాగుంది. అనుమతులు అవసరం లేదని రిపోర్టులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది డిసెంబరు 12న పాశమైలారంలో ఉన్న సిగాచీ ఇండస్ట్రీస్‌ను కర్మాగారాల విభాగం తనిఖీ చేసి ఇచ్చిన రిపోర్టుపై విమర్శలు వస్తున్నాయి. 

సిగాచీలో మైక్రో క్రిస్టలైన్‌ సెల్యులోజ్‌ పౌడర్, పౌడర్డ్‌ సెల్యులోజ్‌ను తయారు చేస్తున్నారు. ఇవి మండే స్వభావం కలిగి ఉంటాయి. సిగాచీ కంపెనీలో మొత్తం 197 మంది పనిచేస్తుండగా, 110 మంది రెగ్యులర్ కార్మికులు, 87 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. 

ఎన్నోలోపాలు..సిగాచీ కర్మాగారంలో కార్మికులు, సిబ్బందికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాథమిక చికిత్స చేయడానికి కనీసం ఫస్ట్‌ఎయిడ్‌ బాక్సులు లేవు. సరైన సంఖ్యలో ఎగ్జిట్‌ ద్వారాలు లేవు. కానీ ఫైర్ ఎగ్జిట్ ద్వారాలు తప్పనిసరిగా ఉండాలి. అసలే మండే స్వభావం ఉన్న ఉత్పత్తులు ఉండే ఇలాంటి కంపెనీలో వైర్లు వేలాడుతూ కనిపించాయనని సమాచారం.  కార్మికుల భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు లేవు. ఎక్కడ చూసినా అపరిశుభ్రత, ఇంకా లోపాలు ఉన్నాయి.