బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ రాజీనామాను ఇండియాకు లింక్ పెడుతూ ప్రధానమంత్రి మోదీపై ఘాటు విమర్శలు చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. విఫలమైన ఆర్థిక విధానల కారణంగా ట్రస్‌ 45 రోజులకే రాజీనామా చేశారని గుర్తు చేశారు. మరి మన ప్రధాని మనకు ఏం ఇచ్చారో అంటూ దేశ ఆర్థిక పరిస్థితిని వివరించారు. 30 ఏళ్లలో ఎప్పుడూ చూడని నిరుద్యోగం చూస్తున్నామని తెలిపారు. ద్రవ్యోల్బణం 45ఏళ్ల కనిష్టస్థాయికి పడిపోయిందని ఎద్దేవా చేశారు. ఎల్పీజీ ధరలు ప్రపంచంలోనే ఎక్కువ భారత్‌లో ఉన్నాయని వివరించారు. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయిలో పడిపోయిందని ధ్వజమెత్తారు కేటీఆర్. 






కార్నెల్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ కౌశిక్ బాబు చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. భారత్‌ ఆర్థిక వ్యవస్థపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం పతనం... నిరుద్యోగం యువతకు షాకింగ్‌ కలిగిస్తుందన్నారు. రూపాయి ఇంకా దిగ్భ్రాంతికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపచవ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న దేశానికి ఇలాంటి అంశాలు చాలా బాధకలిస్తాయని అభిప్రాయపడ్డారు. దీనికి విభజించు పాలించు రాజకీయాలే కారణమని ఆరోపించారు.  






గురవారం కూడా కేంద్ర ఎన్నికల సంఘం... బీబేపీ ఒత్తిడితో పని చేస్తుందని కామెంట్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుసరించిన తీరును తెలంగాణ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తప్పు పట్టారు. ఈసీ తీరు తీవ్ర ఆక్షేపనీయమన్నారు. రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ భారతీయ జనతాపార్టీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఇదో మరో ఉదాహరణ అంటూ ట్వీట్ చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్యస్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్‌పైనా భారతీయ జనతా పార్టీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందన్నారు కేటీఆర్. 2011లోనే సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి పెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని అపహాస్యం చేయడమేనన్నారు. గతంలో తమ అభ్యర్ధన మేరకు రోడ్డు రోలర్ గుర్తును తొలగించి, మరోసారి తిరిగి ఈ ఎన్నికల్లో రోడ్డు రోలర్ తేవడం ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.






తమ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందే కుటిల ప్రయత్నానికి బిజెపి తెరతీసిందన్నారు కేటీఆర్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్న రాజ్యంగ స్ఫూర్తికి ఇది విఘాతం కలిగిస్తుందని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగబద్ధ సంస్థలను తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలన్నారు. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అఫీసర్‌ను బదిలీ చేయడాన్ని ఖండించారు. బీజేపీ జాతీయ నాయకత్వంలో పని చేస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఓటమి తప్పదు అనే బిజెపి అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు