Mahabubabad  Collector: "తొలిమెట్టు" యాప్ రిజిస్ట్రేషన్ అమలును పరిశీలించేందు కోసం జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన జిల్లా కలెక్టర్ శశాంక.. నేలపై కూర్చొని ఉపాధ్యాయ పాత్ర పోషించారు. ప్రాథమిక స్థాయి పాఠశాల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించి, చదవడం, రాయడంలో కలెక్టర్ విద్యార్థులకు మెళుకువలను నేర్పించారు. మౌలిక భాష, గణిత సామర్థ్యాలను(FLN) ప్రాథమిక స్థాయి విద్యార్థులలో పెంపొందించేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన "తొలిమెట్టు" యాప్ రిజిస్ట్రేషన్ అమలును పరిశీలించారు. జిల్లాలోని గంగారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కోమట్లగుడెం ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. 


నేలపై కూర్చొని నిత్య ఉపాధ్యాయుడై..


గంగారం  ప్రాథమిక పాఠశాల 5వ తరగతి విద్యార్థిని సుష్మిత వద్ద కూర్చొని సమ్మక్క - సారలమ్మ పాఠ్యాంశాన్ని చదివించి  ప్రశ్నలు అడిగారు. అమ్మాయి సరిగ్గా జవాబులు చెప్పడంతో.. చిన్నారి సుష్మితను కలెక్టర్ అభినందించారు. ఆ తరువాత  కొమట్లగూడెం ప్రాథమిక పాఠశాల లో 5వ తరగతి విద్యార్థి లాస్విత్, 3వ తరగతి విద్యార్థిని కావేరి అభ్యసన సామర్థ్యాన్ని  పరీక్షించి గణితం, ఇంగ్లీష్, పాఠ్యాంశాలలో ప్రశ్నలు అడిగారు. అనంతరం అభ్యసన మెళుకువలను నేర్పించారు. యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అసిస్మెంట్ ప్రకారం పూర్తి చేయాలని, విద్యార్థులకు నష్టం జరగకూడదని, ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులలో అభ్యాసన సామర్థ్యాన్నీ పెంపొందిచాలని అన్నారు.


ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 5వ తరగతి విద్యార్థుల్లో మౌలిక భాషా, గణిత అభ్యర్థన ఫలితాల సాధన కోసం తొలిమెట్టు పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగానే పర్యవేక్షణ కోసం టాంగరిన్ అనే యాప్ ను కూడా రూపొందించారు. ఇప్పటికే దీంతో జిల్లాలోని ఎఫ్ఎల్ఎన్ క్లస్టర్ నోడల్ అధికారులు పాఠశాల సముదాయాల పరిధిలోని పాఠశాలల్లో సందర్శిస్తూ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక విద్యార్థుల అభ్యసన ఫలితాలను ప్రతి నెల మూల్యాంకనం చేయడానికి తాజాగా స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ అనే మరో యాప్ ను రూపొందించారు. దీని వినియోగంపై తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులు భోదించే ఉపాధ్యాయులకు శిక్షణను ఆన్ లైన్ ద్వారా ఇచ్చారు. ఈ శిక్షణలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయుల కూడా పాల్గొన్నారు. 


ఎలా నమోదు చేయాలంటే..?


తొలిమెట్టును అమలు చేస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఐదు తరగతుల విద్యార్థుల తెలుగు, ఆంగ్లం, గణితం విషయాలకు సంబంధించి అభ్యసన ఫలితాలను మూల్యాంకనం ప్రతి నెలా నమోదు చేయాలి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల వివరాలను ఈనెల 22 వరకు పూర్తి చేయాలి. అక్టోబర్ నెల వివరాలను ఈనెల 28 వరకు నమోదు చేయాలి. ఈ విధంగా ప్రతినెలా 28లోపు నమోదు చేయాలి. ఈ యాప్ లో ఆయా తరగతుల విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో నుంచి తీసుకోవచ్చు. ఈ యాప్ చరవాణుల్లోనే పని చేస్తుంది. ఈ మాల్యాంకనం వల్ల ఆయా తరగతుల్లో నిర్దేశించిన చదవడం, రాయడం అభ్యసన ఫలితాలల్లో వేటిని విద్యార్థులు సాధించారు, వేటిని సాధించలేదని విషయం తెలుస్తోంది. 


Also Read: TS Scholarships: ఫీజు రీయింబెర్స్‌మెంట్, స్కాలర్‌షిప్స్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?