Konda Vishweshwar Reddy Counters CM KCR: తెలంగాణలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్టింగ్ జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు కొనసాగుతున్నాయి. సీఎం వ్యాఖ్యలను అర్థం పర్థం లేనివిగా అందరు నేతలు కొట్టిపారేస్తున్నారు. తాజాగా ఒకప్పటి టీఆర్ఎస్ మాజీ ఎంపీ, తర్వాత కాంగ్రెస్ నేత, ఇటీవల బీజేపీలో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 


క్లౌడ్ బరస్టింగ్ కు సంబంధించి కేసీఆర్ ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇచ్చారు. ఒకవేళ వర్షం 100 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువగా పడితే క్లౌడ్ బరెస్టు జరిగిందని అనుమానించాలని చెప్పారు. 


కేసీఆర్ అంటున్నట్లుగా అసలు క్లౌడ్ బరస్ట్ చేసింది పాకిస్తానా? లేక చైనానా? చెప్పాలని ఎద్దేవా చేశారు. రాకెట్లు లేదా విమానంతో క్లౌడ్ బరస్ట్ చేయాలంటే వాళ్ళకి ఇండియాలో ఒక సీక్రెట్ ఏర్ బేస్ కచ్చితంగా ఉండాలని వివరించారు. బహుశా ఆ ఎయిర్ బేస్ కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌ లోనే ఉండి ఉంటుందని ఎద్దేవా చేశారు. తనకు మించిన మెదడు, లాజిక్ ముఖ్యమంత్రికి బాగా ఉంటుందని లద్దాక్‌లో క్లౌడ్ బరస్ట్ సాధ్యమేనని అన్నారు. అయితే, గతంలో అక్కడ జరిగిందా లేదా అనేది తనకు తెలీదని చెప్పారు. 


కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వరదలు వచ్చినా ఇబ్బందులు తలెత్తవని గతంలో చెప్పారని, మరి ఇప్పుడేమైందని ప్రశ్నించారు. దీనికి సంబంధించి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక వీడియోను కూడా ట్వీట్ చేశారు. అందులో ఓ పంప్ హౌస్‌లోకి నీళ్లు వచ్చాయి. కొండ పోచమ్మ సాగర్ ఇప్పటి వరకూ నింపారా? అని ప్రశ్నించారు. మునగని స్థానంలో మోటార్లు పెడతారు తప్ప మునిగే స్థానంలో పెడతాడా? అని కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు.






కేసీఆర్ అసలేమన్నారంటే..


గోదావరి వరదలకు కారణం కుట్ర జరిగి ఉండవచ్చని సీఎం కేసీఆర్ జూలై 17న భద్రాచలం పర్యటన సందర్భంగా అనుమానం వ్యక్తం చేశారు. క్లౌడ్ బరస్ట్ అనే విధానంతో ఇతర దేశాల వాళ్లు మన దేశంలో అక్కడక్కడ ఈ పని చేసి ఉంటారని ఆరోపించారు. కావాలనే ఈ పని చేసి ఉన్నారని, గతంలో కశ్మీర్ లో లద్దాఖ్, లేహ్‌లో చేశారని, తర్వాత ఉత్తరాఖండ్‌లోనూ క్లౌడ్ బరస్ట్ చేశారని గుర్తు చేశారు. ఈ మధ్య గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోనూ క్లౌడ్ బరస్ట్ చేశారని తమకు సమాచారం వచ్చిందని కేసీఆర్ అన్నారు. మొత్తానికి వాతావరణంలో సంభవించే ఇలాంటి ఉత్పాతాల వల్ల ప్రభావితం అయ్యే ప్రజల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు.