Hyderabad News: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఇందిరమ్మ ఇళ్లు ఒకటి. ఈ పథకానికి సంబంధించిన మరో కీలక అప్‌డేట్ వచ్చేసింది. జనరల్ ఎలక్షన్ కోడ్ ఉన్నందున్న ప్రస్తుతానికి దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ జూన్ తర్వాత మంచి రోజున విధి విధానాలు ప్రకటించి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనుంది ప్రభుత్వం.
ఇందిరమ్మ ఇళ్లు లాంటి భారీ ప్రాజెక్టులకు నిధుల కొరత ప్రధాన ఆటంకంగా మారుతుంది. అందులో కాంగ్రెస్ ఇచ్చిన హామీ కూడా భారీగానే ఉంది. ఇంటి జాగా ఉన్న పేదలకు గృహనిర్మాణానికి 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇంటి స్థలం లేని పేదలకు ఇంటి స్థలంతోపాటు ఐదు లక్షలు ఇస్తామని పేర్కొంది.
ఇలాంటి భారీ ప్రాజెక్టుల అమలుకు ఆదే స్థాయిలో నిధులు కావాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం అనుకున్నంత విజయవంతం కాలేదు. ఆశావాహులు భారీ సంఖ్యలో ఉండటం ఒక కారణమైతే... నిధులు కొరత మరో కారణం. అందుకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల విషయంలో కేసీఆర్ సర్కారు అబాసుపాలైంది. ప్రజావ్యతిరేకతను కూడా మూటకట్టుకుంది.
ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇళ్ల నిర్మాణాలపై భారీగా హామీలు ఇచ్చింది. దీనిపై ప్రజలు కూడా అంతే స్థాయిలో ఆశలు పెట్టుకొని ఉన్నారు. అసలు ప్రభుత్వ నిధులు అడుగంటిపోయి ఉన్నాయి. ఇలాంటి టైంలో ఈ ఇళ్ల పథకం అమలు అంత ఈజీ కాదు. అందుకే అప్పులు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ప్రభుత్వ ప్రయత్నం ఇన్నాళ్లకు ఎండ్‌కు వచ్చింది. పేదలకు ఇళ్ల నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు హడ్కో అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుపై దశలవారీగా అప్పులు ఇచ్చేందుకు ఓకే చెప్పింది. ఇప్పటికే కేంద్రం నుంచి కూడా ఈ పథకానికి డబ్బులు వస్తున్నాయి. ఇలా వచ్చే నిధులతో నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు.
ఇళ్ల నిర్మాణానికి అయ్యే డబ్బులను హడ్కో దశల వారీగా ఇవ్వనుంది. ప్రస్తుతానికి 3వేల కోట్లు రూపాయలు రుణం ఇచ్చేందుకు హడ్కో ఓకే చెప్పింది. ఈ రుణంలో తొలిదశలో 800 కోట్లకుపైగా విడుదల చేయనుంది. ఇప్పటిక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. విధి విధానాలు కూడా ఖరారు అయ్యాయి. ప్రజాపాలన ద్వారా లబ్దిదారుల ఎంపిక కూడా జరిగింది. ఇప్పుడు నిధుల కోరత తీరబోతున్నందున ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన రానుంది. మంచి రోజు చూసుకొని పథకాన్ని ప్రారంభించనుంది.