Betting Apps Promotion Case | హైదారాబాద్ మెట్రోలో నిబంధనలకు విరుద్దంగా 2022 నుంచి నిషేధిత బెట్టింగ్ యాప్స్  ప్రమోషన్ జరిగిందని, కోట్లాది రూపాయల విదేశీ లావాదేవీలు జరిగాయని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో ప్రముఖ న్యాయవాది నాగూర్ బాబు ఇటీవల దాఖలు చేసిన పిల్ పై మంగళవారం హైకోర్టులో కీలక విచారణ జరిగింది. విచారణ సందర్భంగా మెట్రో తరుపు నుండి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించగా కౌంటర్ కు బదులుగా మెమో దాఖలు చేశారు అడ్వకేట్ జనరల్. ఈ మెమోలో పలు కీలక అంశాలను హైకోర్టు ధర్మాసనం ముందు ప్రస్తావించారు ఏజీ.

గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు..

గతంలో మేము బెట్టింగ్ యాప్స్ ను హైదరాబాద్ మెట్రో రైలులో ప్రసారం చేసిన మాట వాస్తవమే కానీ, ఇప్పుడు అలా చేయడంలేదంటూ హైకోర్టుకు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో ఏం జరిగింది. నిషేధిత బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయమని ఎవరు చెప్పారు.? అందులో విదేశీ సంస్దలకు చెందిన నిషేధిత బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. వాటిని ఎందుకు ప్రమోట్ చేాశారు. విదేశీ  కంపెనీల నుండి నగదు బదిలీ ఎలా జరిగింది..?  ఇలా ఈ అంశాలపై కౌంటర్ ధాఖలు చేయాల్సిన ఏజి, వీటి ప్రస్తావన ప్రక్కనపెట్టి, తమ పరువు పోతోందని, సోషల్ మీడియాలో మెట్రోపై జరగుతున్న ప్రచారం ఆపాలని కోరారు. 

ABP Desam లో ప్రసారమైన కథనంపై హైకోర్టు ఏమంది..?

ఈ సందర్భంగా గౌరవ ధర్మాసనం ముందు ABP Desam డిజిటల్ మీడియాలో ప్రసారమైన కథనాన్ని ప్రస్తావించారు అడ్వకేట్ జనరల్. మెట్రో పై జరుగుతున్న ప్రసారంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ABP Desam ప్రసారం చేసిన అడ్వకేట్ నాగూర్ బాబు ఇంటర్వూ మొత్తాన్ని లిఖితపూర్వకంగా మెమోలో ధర్మాసనం ముందుంచారు. జర్నలిస్టు శేషు అడిగిన ప్రశ్నలు, అందుకు అడ్వకేట్ (పిటీషనర్ ) నాగూర్ బాబు చెప్పిన సమాధానాలను పూర్తిగా మెమోలో పొందుపరిచి న్యాయమూర్తి ముందుంచారు. ఇకపై సోషల్ మీడియాలో ఈ తరహా ప్రచారం ఆపాలంటూ కోరారు.

గతంలో ప్రమోషన్ చేసిన మాట వాస్తవమేనంటూ ఒప్పుకుంటూనే, ఆ తరువాత బెట్టింగ్ ప్రమోషన్ ను మెట్రో యాజమాన్యం వ్యతిరేకించినట్లు కొన్ని పత్రికల్లో ప్రచురితమైన కథనాలను ధర్మాసనం ముందుంచే ప్రయత్నం చేశారు. ABP Desam లో ప్రసారమైన కథనంపై ఏజీ వాదనను తోసిపుచ్చింది ఉన్నత న్యాయస్దానం. న్యాయవాది పిటీషనర్ అయినంత మాత్రాన మాట్లాడొద్దంటూ చెప్పలేమని తెలిపింది. తదుపరి విచారణలోపు మెట్రోలో నిషేధిత బెట్టింగ్  వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ అడ్వకేట్ జనరల్ ను ఆదేశించిన ధర్మాసనం, కేసు విచారణను వాయిదా వేసింది.

ABP Desam ఇంటర్వూలో ఏముంది...?

హైదరాబాద్ మెట్రో రైలులో గత కొంత కాలంగా  నిషేధిత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరిగిన తీరు, నిబంధనలకు విరుద్దంగా నగదు చేతులు మారిన వ్యవహారంపై ప్రముఖ న్యాయవాది నాగూర్ బాబుతో  ABP Desam  ప్రత్యేక ఇంటర్వూ  ప్రసారం చేసింది. హైదరాబాద్ లో యూట్యూబ్ స్టార్స్, సినీ సెలబ్రిటీలపై బెట్టింగ్ ప్రమోషన్ కేసుపెట్టి ,విచారణ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రోలో జరిగిన ఇల్లీగల్ బెట్టింగ్ ప్రమోషన్ పరిస్దితి ఏంటని ఏబిపి దేశం ప్రశ్నించింది. ఏటా కోటిన్నర మందికిపై ప్రయాణికులు మెట్రో ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. లక్షలాది మంది యువకులు మెట్రో ట్రైన్ లో బెట్టంగ్ ప్రమోషన్ చూసి ఆకర్షితులయ్యారు. ఇటీవల బెట్టింగ్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు మెట్రో న్యాయం చేయగలదా, మెట్రోలో నిబంధనలకు విరుద్దంగా నిషేధిత , విదేశీ బెట్టింగ్ యాప్ లు ఎలా ప్రమోట్ చేస్తారంటూ ప్రశ్నించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ABP Desam లో ప్రసారమైన ఇంటర్వూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రముఖ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ (అన్వేష్) ఇదే ఇంటర్వూకు స్పందించి, తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ గా పెట్టుకోవడంతో ఊహించని స్దాయిలో రీచ్ అయ్యింది. దీంతో అడ్వకేట్ జనరల్ ఇంటర్వూ ప్రస్తావన హైకోర్టు ధర్మాసనం ముందుంచి, సోషల్ మీడియాలో మెట్రోపై జరుగుతున్న ప్రచారాన్ని కట్టడి చేయాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.