బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వ్యూహాలతో సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయన ఆదివారం సాయంత్రమే ఎర్రవల్లి ఫాం హౌస్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం ఉదయం నందినగర్ నివాసం నుండి కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. కేసీఆర్ సభకు వస్తుండటంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
గతంలో కేసీఆర్‌ను సభకు రావాలని సవాల్ విసిరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తుండటంతో పూర్తి స్థాయిలో చర్చకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండేళ్లలో ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ సర్కార్‌ను గట్టిగా నిలదీయాలని, కృష్ణా జలాల సాధనపై ప్రభుత్వ వైఫల్యాలు లేవనెత్తాలని కేసీఆర్ ఇప్పటికే తన పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు రెడీ..
ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులైన పాలమూరు-రంగారెడ్డి వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చ జరపాలని, అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే నీటిపారుదల అంశంపై సుదీర్ఘ చర్చ జరగకుండా, కేవలం ఒక రోజుకే పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కృష్ణా జలాల పంపిణీలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందనే పాయింట్ మీదనే చర్చను కేంద్రీకరించాలని అధికార పక్షం వ్యూహరచన చేస్తోంది. మరోవైపు ఈ సమావేశాలను ఎక్కువ రోజులు సాగదీయకుండా 2, 3 రోజుల్లోనే ముగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో జ్యుడీషియరీ క్యాడర్ అధికారి ఆర్. తిరుపతి అసెంబ్లీ కార్యదర్శిగా వ్యవహరించడం ఒక ప్రత్యేకత. తొలిరోజు సంతాప తీర్మానాలు, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక వంటి ప్రక్రియ ఉంటాయి. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో అసలు ఎజెండా ఖరారు కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, రైతు సమస్యలను సభ వేదికగా ఎండగట్టాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. గత సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన చర్చలో హరీశ్‌రావు సంధించిన ప్రశ్నలకు మంత్రులు ఇబ్బంది పడ్డ విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఈసారి కేసీఆర్ రంగంలోకి దిగడంతో చర్చలు మరింత వాడిగా జరిగే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ హయాంలోనే తప్పిదాలు అంటున్న కాంగ్రెస్
కృష్ణా జలాల పంపిణీ విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయాన్నే ప్రధాన అస్త్రంగా మార్చుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నీటిలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలకు మాత్రమే అంగీకరిస్తూ 2015లో చేసుకున్న ఒప్పందాన్ని సభలో గట్టిగా వినిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. నాటి అంతర్రాష్ట్ర సమావేశపు మినిట్స్‌లోని కీలక అంశాలను ప్రస్తావిస్తూ, చర్చను కేవలం ఈ ఒక్క పాయింట్ చుట్టూనే తిప్పడం ద్వారా సభా సమయాన్ని పూర్తి చేయాలని అధికార పక్షం వ్యూహరచన చేస్తోంది.
ఈ అంశంపై ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కసరత్తు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆయన, కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండి సాగునీటి రంగ నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సభలో కృష్ణా జలాల పంపిణీ అంశం మినహా ఇతర అంశాలకు చర్చకు అవకాశం ఇవ్వకూడదని, అప్పటి ప్రభుత్వ వైఫల్యాలనే ఎండగట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది.