BJP Telangana Chief Bandi Sanjay on BRS Nanded Meeting: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ నిర్వహించిన జాతీయ సభ తుస్సు మందని, మహారాష్ట్ర జనం అసలు పట్టించుకోనేలేదు అన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు 25 రోజులుగా నాందేడ్ లోనే మకాం వేసి ఏర్పాట్లు చేసినా బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చివరకు తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి ఒక్కొక్కరికి రూ.500లు ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి నాందేడ్ వేదికగా కేసీఆర్ పెద్ద డ్రామా చేశారని.. నాందేడ్ లో బీఆర్ఎస్ ను ఎవరు పట్టించుకుంటారు? అని ప్రశ్నించారు. ఈ మేరకు బీఆర్ఎస్ సభపై బండి సంజయ్ హైదరాబాద్ లో ఓ ప్రకటన విడుదల చేశారు.
- పెద్ద పెద్ద నాయకులు ఎవరెవరో చేరతారని ప్రచారం చేసుకున్నా.. చివరకు చేరిన అరొకర నాయకులంతా అవుట్ డేటేడ్ వాళ్లే. సొంత ఊరిలోనే 10 ఓట్లు కూడా వేసుకోలేని నాయకులే ఉన్నరు. వేల సంఖ్యలో బీఆర్ఎస్ కండువాలు తీసుకుపోతే... ఆ కండువాలు పట్టుకుని కేసీఆర్ నిలబడ్డా... ఎవరూ రాక విసుక్కున్నారంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏమిటో అర్ధమవుతోంది.
- ఇగ ఆ సభలో, ఆ తరువాత జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ ప్రధానంగా నాలుగైదు అంశాలు ప్రస్తావించారు... బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే మహిళలకు చట్ట సభల్లో 33 శాతం ప్రాతినిధ్యం పెంచుతారట. ప్రతి అసెంబ్లీ, కౌన్సిల్, పార్లమెంట్ లో 1/3 శాతం సీట్లు కేటాయిస్తారట. మీ తొలి కేబినెట్ లో ఐదేండ్లపాటు ఒక్క మహిళను కూడా మంత్రిగా చేయలే.. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ను ఎందుకు నియమించలే. నామినేటెడ్ పోస్టుల్లో ఒక్క మహిళకు కూడా ఎందుకు అవకాశమియ్యలే. ఇప్పడున్న లోక్ సభ, రాజ్యసభ ఎంపీల్లో ఒక్కరైనా మహిళ ఉన్నారా? ఇవన్నీ నాందెడ్ సభలో ప్రస్తావిస్తే బాగుండేది. నీలాంటి పచ్చి అబద్దాల కోరు, మోసగాడు మహిళలకు 1/3 శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెబుతుంటే జనం అసహ్యించుకుంటున్నరు.
- మహారాష్ట్రలోని రైతుల ఆత్మహత్యల గురించి కేసీఆర్ ప్రస్తావించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. తెలంగాణ జనాభాతో పోలిస్తే మహారాష్ట్ర జనాభా మూడు రెట్లు ఎక్కువ. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే 4వ స్థానంలో ఉంది. రెండు సార్లు అధికారమిస్తే ఆత్మహత్యలను నిలువరించలేకపోయిన అసమర్థుడు కేసీఆర్. సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లోనే రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో సగటున రెండ్రోజులకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నడు. ఇవన్నీ దాచిపెట్టి రైతులను ఉద్దరిస్తానని నువ్వు చెబుతుంటే... తెలంగాణ రైతులు నవ్వుకుంటున్నరు.
- రైతు బంధు మినహా అన్ని సబ్సిడీలు బంద్ చేసిన ఘనుడు కేసీఆర్. రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న సబ్సిడీలను కూడా అడ్డుకున్నరు. ఫసల్ బీమాను అమలు చేయకుండా రైతులు పంట నష్టపోతున్నా కనీసం సాయం చేయని సీఎం కేసీఆర్. ఫ్రీగా ఎరువులిచ్చి అద్బుతాలు స్రుష్టిస్తానని మాట తప్పిన కేసీఆర్ ఇయాళ మాట్లాడింది ఎట్లుందుంటే... రైతును కత్తితో పొడిచి అయ్యో నొప్పి ఉందా? అని అడిగినట్లుంది.
- బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతటా 24 గంటల కరెంట్ ఇస్తాననడం పెద్ద జోక్... తెలంగాణలో సింగిల్ ఫేజ్ ద్వారానే వ్యవసాయానికి కరెంట్ సరఫరా చేస్తున్నామని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్టేట్ మెంట్ ఇచ్చారు.. కేసీఆర్ సభ నిర్వహించిన ప్రాంతానికి కూత వేటు దూరంలోనే ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని రైతులంతా కనీసం 8 గంటల కరెంట్ అయినా సరఫరా చేయాలని సబ్ స్టేషన్లను ముట్టడిస్తూ, రోడ్లపై ధర్నాలు చేస్తున్నరు. ఏసీడీ ఛార్జీలు పెంచినందుకు విద్యుత్ సిబ్బందిని బంధించిన సంగతి తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. ఇయాళ కేసీఆర్ చెప్పిన మాటలు విని వాళ్లంతా నవ్వుకుంటున్నరు. అబద్దాలకు ఆస్కార్ అవార్డ్ ఇవ్వాల్సి వస్తే... నాందేడ్ లో కేసీఆర్ చెప్పిన అబద్దాలకు ఆస్కార్ అవార్డ్ కచ్చితాం దక్కేది.
- ఇరిగేషన్, పవర్, రోడ్డు, రవాణా విషయాల్లో కేసీఆర్ మేధావి అయినట్లు ఫోజు కొడుతున్నరు. గాలి మాటలు పోగేసుకొచ్చి అవే నిజమని చెబుతున్నరు. అవన్నీ పచ్చి అబద్దాలే. మాట్లాడితే 70 వేల టీఎంసీల నీరు, 4 లక్షల మెగావాట్ల విద్యుత్ అంటడు.. దేశం గురించి తరువాత... తెలంగాణలో గత 9 ఏళ్లలో ఎన్ని వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయినయ్? వాటిలో ఎన్ని టీఎంసీల నీరు సాగుకు మళ్లించినవ్. నువ్వు కట్టిన కొత్త ప్రాజెక్టుల వల్ల ఎన్ని లక్షల ఎకరాలకు అదనంగా సాగు నీరిచ్చినవో సమాధానం చెప్పే దమ్ముందా? కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకు కూడా అదనంగా సాగు నీరు ఇయ్యనోడివి నువ్వా చెప్పేది?
- నాందెడ్ పక్కనున్న ఆదిలాబాద్ జిల్లాలోనే మిషన్ భగీరథ అమలు కాక.. బావులు, బోర్ల వద్దకు పోయి మంచి నీళ్లు తెచ్చుకుంటున్నరు... మూసీ పరివాహక ప్రాంతం మొదలు అలంపూర్ దాకా మిషన్ భగీరథ నీళ్లు రాక ఆర్వో ప్లాంట్ల నుండి నీళ్లు తెచ్చుకుని తాగుతున్నరు. మీరు అధికారంలోకి వస్తే దేశమంతా మంచి నీళ్లు ఇస్తానంటుంటే నవ్వొస్తుంది.
- బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రైవేటు పరమైన సంస్థలన్నింటినీ ప్రభుత్వ పరం చేస్తాననడం మరో పెద్ద జోక్. వందల కోట్లు ఖర్చయ్యే నిజాం షుగర్ ఫ్యాక్టరీ, రియాన్ ఫ్యాక్టరీలను ఉద్దరించడమే చేతగాని మీరు దేశంలో ప్రైవేటుపరమైన పెద్ద పెద్ద సంస్థలను ప్రభుత్వ పరం చేస్తానంటే నమ్మేదెవరు?
- మహారాష్ట్రలో పేదలకు అవాస్ యోజన కింద 15 లక్షల 32 వేల 36 ఇండ్లు కట్టించారు. తెలంగాణలో ఎన్ని ఇండ్లు కట్టి పేదలకు ఇచ్చినవో దమ్ముంటే సీఎం సమాధానం చెప్పాలి. మహారాష్ట్ర లో ఆయుష్మాన్ భారత్ కింద కోట్లాది మంది ప్రజలు రోగమొస్తే పైసా భారం పడకుండా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేసుకుంటున్నరు. మరి ఈడ కేసీఆర్ ఏం చేశారో చెప్పే దమ్ముందా? మహారాష్ట్రలో ఆకాల వర్షాలవల్ల పంట నష్టపోయిన లక్షలాది మంది రైతులకు నష్టపరిహారమిచ్చారు. మరి ఇక్కడ ఒక్క రైతుకైనా పరిహారమిచ్చారా?
- పారిశ్రామిక రంగంలో మహారాష్ట్ర నెంబర్ వన్. ఫార్మా, ఐటీ రంగాల్లో కూడా మహారాష్ట్ర తెలంగాణాను మించిపోయింది. అంతెందుకు మొన్న దావొస్ పర్యటనకు పోయి గొప్పలు చెప్పుకున్న మీ పుత్రరత్నం కేటీఆర్ తెలంగాణకు ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? మహారాష్ట్ర కు (1 లక్షా 37 వేల కోట్లు) వచ్చిన పెట్టుబడుల్లో తెలంగాణకు 6వ వంతు (21,000 కోట్లు) కూడా తీసుకు రాలేక పోయారు. మహారాష్ట్ర సంగతి తరువాత.. అందులోని ఒక్క పూణే నగరానికి తెచ్చినన్ని నిధులు కూడా తెలంగాణకు తీసుకురాలేకపోయారు. పూణె నగరానికి 21 వేల కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చినయ్. ఇగ వలసల గురించి మొన్న ప్రజా సంగ్రామ యాత్రలోనే సాక్షాలతో చూపించిన. ఇప్పటికీ తెలంగాణా నుండి ఉద్యోగ అవకాశాల కోసం మహారాష్ట్ర ముంబై వెళ్తున్నరు పాలమూరు ప్రజలు.
- తెలంగాణ 4 విషయాల్లో నెంబర్ వన్ గా నిలిచింది.1. లిక్కర్ ఆదాయంలో మహారాష్ట్రను మించిపోయింది. 12 కోట్ల జనాభా ఉన్న మహారాష్ట్రలో మద్యం ద్వారా వచ్చే ఆదాయం రూ.17 వేల కోట్లు.... మరి 4 కోట్లున్న తెలంగాణలో మాత్రం రూ. 40 వేల కోట్లు దాటింది. 2. నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగినయ్ తెలంగాణలోనే. 3. దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణ. 4. దేశంలోనే అత్యధిక ధరకు పెట్రోల్, డీజిల్ అమ్ముతున్న రాష్ట్రం తెలంగాణ.
- కేసీఆర్ మళ్లీ విదేశాలను పొగుడుతూ భారత్ ను కించపర్చడం సిగ్గు చేటు.. కేసీఆర్ జీన్స్ పై అనుమానం కలుగుతోంది. వెంటనే డీఎన్ ఏ టెస్ట్ చేయాలి. ఆనాడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లను పొగిడితే అవి సర్వనాశనమైనయ్.. ఇయాళ అమెరికా, రష్యా, చైనా అని పాట పడుతున్నడు. కేసీఆర్... భారత ఆర్దిక వ్యవస్థపై మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదు..
- నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక భారత్ ఆర్ధిక వ్యవస్థ ప్రపంచంలోనే 11వ స్థానం నుండి 5వ స్థానానికి వచ్చింది. మరో 2, 3 ఏళ్లలో 3వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. మరి కేసీఆర్ పాలనలో తెలంగాణలో చేసిందేమిటి? మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చారు.
- శివాజీ జన్మ స్థలం నుండి బీఆర్ఎస్ యాత్రలు స్టార్ట్ చేస్తారనడం సిగ్గుచేటు. శివాజీ హిందూ సామ్రాజ్యం స్థాపించిండు. మరి కేసీఆర్ చేసిందేమిటి? తెలంగాణను రజకార్ల సమితికి తాకట్టు పెట్టారు. నిజాం సమాధి ముందు మోకరిల్లారు. నిజాం మనవడు చనిపోతే ప్రజల సొమ్ముతో అంత్ర్యక్రియలు జరిపించారు. తెలంగాణ హిందూ రాజ్యమని చెప్పే దమ్ము కేసీఆర్ కు ఉందా?
- లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఒక్క పిలుపునిస్తే దేశమంతా కదిలింది. ఇయాళ బీఆర్ఎస్ పిలుపుతో అంతా కదిలిరావాలని కేసీఆర్ చెప్పడం చూసి జనం నవ్వుకుంటున్నరు. లోక్ నాయక్ మీలాగా అవినీతిపరుడు కాదు. మీ కుటుంబం లెక్క కొడుకు, బిడ్డ, అల్లుడుకు పదవులిచ్చి వారసత్వ రాజకీయాలు చేయలేదు. వేల కోట్ల రూపాయలు కూడబెట్టలేదు. మీలాగా తాగుబోతు, తిరుగుబోతు కాదు.. అబ్కారీ సర్కార్ కావాలని ఏనాడూ ఆలోచించలేదు. లోక్ నాయకుడితో కేసీఆర్ కు పోలికా?
- కేసీఆర్ ఇయాళ ఒక్క మాట మాత్రం నిజం చెప్పిండు... బీఆర్ఎస్ పార్టీ కాదు.. మిషన్ అని అన్నడు. నిజమే.. బీఆర్ఎస్ ఒక అవినీతి మిషన్.... ఫ్యామిలీ మిషన్... కమీషన్ల మిషన్... మీ కుటుంబమంతా అబద్దాల కోరులే. దగాకోరులే. జనం మిమ్ముల్సి చూసి నవ్వు కుంటున్నారనే ఇంగిత జ్ఝానం లేకుండా పచ్చి అబద్దాలాడుతూ దర్జాగా మోసాలు చేసే ఫ్యామిలీ మీది. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ సంగతి అర్ధమై తిరగబడుతున్నరు. అందుకే తట్టాబుట్టా సర్దుకుని బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నరు. అయినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనే బీఆర్ఎస్ ను సమాధి చేయడం ఖాయం అని ఓ ప్రకటన విడుదల చేశారు బండి సంజయ్.