హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫలితాలపై కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ వ్యతిరేకత కనిపించిందని, బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. ‘పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలైతే బీఆర్‌ఎస్ విజయం సాధించేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. మేం ఎప్పుడూ అహంకార వైఖరి ప్రదర్శించలేదు. రెండేళ్ల పాలనలో నేను చనిపోయాలని శాపాలు పెట్టడం తప్ప, కాంగ్రెస్ చేసిందేమీ లేదు’ అన్నారు. కేసీఆర్ మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు.
తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ శాసనసభాపక్ష (BRSLP), రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కేటీఆర్, హరీష్ రావు, పార్టీ నేతలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతల సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా రాష్ట్ర జలవనరుల రక్షణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించనున్నారు.
తెలంగాణ భవన్‌లో కీలక భేటీబీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ సంయుక్త సమావేశం నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, సీనియర్ నాయకులు అందరూ తెలంగాణ భవన్‌కు చేరుకోవడంతో అక్కడ సందడి నెలకొంది. ఎన్నికల తదనంతర పరిస్థితులు, ప్రజల పక్షాన పోరాడాల్సిన అంశాలపై ఈ భేటీలో బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
జలకుట్రలపై కేసీఆర్ కదనభేరితెలంగాణ నీటి వాటాలను దోచుకోవడానికి కుట్రలు జరుగుతున్నాయని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు. "బడేభాయ్ - చోటేభాయ్" (కేంద్రంలోని బీజేపీ - రాష్ట్రంలోని కాంగ్రెస్) రూపంలో తెలంగాణ జలాలను తరలించుకుపోయేందుకు దొంగలంతా ఒక్కటయ్యారని ఆయన విమర్శించారు. నాడు అరవై ఏళ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణ రైతాంగం పడ్డ కష్టాలను గుర్తు చేస్తూ, ఇప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు మరో జలపోరాటానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ ఎక్స్ ఖాతా ద్వారా పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలుకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసే కనుసైగలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి 'జీ హుజూర్' అంటూ కేంద్రం చెప్పినట్లు వినడం వల్ల తెలంగాణ రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని కేసీఆర్ అభిప్రాయం. కాంగ్రెస్ నేతల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, తెలంగాణ నీటి హక్కుల సాధన కోసం త్వరలోనే ఒక భారీ ఉద్యమాన్ని చేపడతామని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.