WhatsApp GhostPairing scam | హైదరాబాద్: వాట్సాప్‌లో ఇటీవల విస్తరిస్తున్న 'ఘోస్ట్ పేయిరింగ్' (Ghost Pairing) అనే కొత్త రకమైన సైబర్ మోసం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ స్కామ్ ద్వారా మీ ప్రమేయం లేకుండానే మీ వాట్సాప్ అకౌంట్‌ను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉంది. ఈ మోసం ఎలా జరుగుతుంది, దీని నుండి ఎలా తప్పుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సైతం జాగ్రత్తగా ఉండాలంటూ ఘోస్ట్ పెయిరింగ్ స్కాం గురించి ప్రజలను హెచ్చరించారు.

Continues below advertisement

ఘోస్ట్ పేయిరింగ్ అంటే ఏమిటి?సాధారణంగా మనం వాట్సాప్‌ను కంప్యూటర్‌లో వాడాలంటే QR కోడ్ స్కాన్ చేయాలి లేదా OTP ఎంటర్ చేయాలి. కానీ ఈ 'ఘోస్ట్ పేయిరింగ్' పద్ధతిలో హ్యాకర్లు ఒక ఫేక్ లింక్‌ను పంపుతారు. "మీ ఫోటో చూశారా?" లేదా మీ గురించి ఇక్కడ ఏదో ఉంది వంటి ఆకర్షణీయమైన మెసేజ్‌లతో ఈ లింక్ వస్తుంది. మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే, ఒక ఫేక్ వాట్సాప్ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు తెలియకుండా చేసే చిన్న పొరపాటు వల్ల, మీ వాట్సాప్ అకౌంట్ నేరుగా హ్యాకర్ల డివైజ్‌కు కనెక్ట్ (Pair) అయిపోతుంది. దీనికి ఎటువంటి OTP లేదా స్కానింగ్ అవసరం లేకుండానే సైబర్ నేరగాళ్లు మీ వాట్సాప్ అకౌంట్‌లోకి ప్రవేశిస్తారు.

హ్యాకర్ల చేతికి చిక్కితే జరిగే తీవ్ర నష్టంఒక్కసారి మీ వాట్సాప్ ఖాతా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్తే, మీ వ్యక్తిగత గోప్యతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. మీ వ్యక్తిగత చాటింగ్‌లు, ఫోటోలు, వీడియోలు అన్నీ వారు చూడగలరు. అంతేకాకుండా, మీ కాంటాక్ట్ లిస్ట్‌ను దొంగిలించి, మీ పేరుతో మీ స్నేహితులకు లేదా బంధువులకు మెసేజ్‌లు పంపి డబ్బులు అడుగుతారు. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మీ అకౌంట్ నుండి లాగ్ అవుట్ చేసి, మీ ఖాతాను మీరే వాడలేకుండా లాక్ చేసే ప్రమాదం కూడా ఉంది. మీ వాట్సాప్ అకౌంట్లో ఉన్న సమాచారం ద్వారా ఇతరులను బ్లాక్ మెయిల్ చేసే అవకాశాలు లేకపోలేదు.

అప్రమత్తంగా ఉండాలని సూచనలుఈ సైబర్ దాడుల నుండి రక్షణ పొందడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. గుర్తుతెలియని వ్యక్తుల నుంచే కాకుండా, తెలిసిన వారి నుండి వచ్చినా సరే.. అనుమానాస్పద లింక్‌లను అస్సలు క్లిక్ చేయవద్దు. మీ వాట్సాప్ సెట్టింగ్స్‌లోని 'Linked Devices' ఆప్షన్‌ను తరచుగా చెక్ చేస్తూ ఉండండి. అక్కడ మీకు తెలియని ఏదైనా డివైజ్ కనిపిస్తే వెంటనే దాన్ని Log Out చేయండి. అన్నింటికంటే ముఖ్యంగా, మీ ఖాతాకు అదనపు భద్రత కోసం 'Two-Step Verification' ఫీచర్‌ను వెంటనే ఎనేబుల్ చేసుకోవాలని ఐపీఎస్ సజ్జనార్ సైతం సూచించారు.

సైబర్ భద్రత కోసం చిట్కాలుమీ డిజిటల్ భద్రతను మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ క్రింది విషయాలను గమనించండి.అఫీషియల్ యాప్స్ మాత్రమే: ఎప్పుడూ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి అధికారిక వాట్సాప్ యాప్‌ను మాత్రమే వినియోగించాలి. GB WhatsApp, WhatsApp Plus వంటి మోడిఫైడ్ వెర్షన్లు వాడటం వల్ల హ్యాకింగ్ అయ్యే అవకాశాలు 90 శాతం ఎక్కువగా ఉంటాయి.

ప్రైవసీ సెట్టింగ్స్: మీ ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ సహా Last Seen వివరాలను My Contacts కి మాత్రమే పరిమితం చేయాలి. వీలైతే మీ డీపీ మినహా ఇతర విషయాలు ఎవరికీ తెలియకుండా డిసెబుల్ చేసుకోవడం బెటర్. 

రిపోర్ట్, బ్లాక్ చేయడం: మీకు ఏదైనా అనుమానాస్పద లింక్ లేదా మెసేజ్ వస్తే, వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి వాట్సాప్‌కు రిపోర్ట్ చేయండి.

సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్: ఒకవేళ మీరు మోసపోయినట్లు గుర్తిస్తే, వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలపాలి.  లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో మీ సమస్యను ఫిర్యాదు చేయండి.