KCR Comments at Telangana Bhavan | హైదరాబాద్: పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను కేంద్రం వెనక్కి పంపితే దద్దమ్మ ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుందని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండేళ్లపాటు తాను మౌనం వహించినా ప్రజా ప్రయోజనాల కోసం పనిచేయని ప్రభుత్వంపై గ్రామగ్రామాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బహిరంగ సభలు ఏర్పాటు చేసి, స్వయంగా తాను హాజరై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు. ఇవాల్టి వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క.. రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తామని హెచ్చరించారు. పాలన కోసం ప్రభుత్వానికి రెండేళ్లు గడువు ఇచ్చాం. కానీ ప్రజల ప్రయోజనాలు కాలరాస్తుంటే.. కృష్ణా, గోదావరి జలాలు తరలించుకుపోతుంటే చూస్తూ కూర్చునేది లేదన్నారు. రెండు, మూడు రోజుల్లో జిల్లాల నేతలతో సమావేశాలు ప్రారంభించి, జల దోపిడీని అడ్డుకునేందుకు మరో పోరాటం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ప్రజలను టెంప్ట్ చేసి మోసంతో ఓట్లు సాధించారు..
బీఆర్ఎస్‌ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం పూర్తయ్యాక తెలంగాణ భవన్‌లో మాజీ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాలను భ్రష్టు పట్టిస్తుంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సైతం రాష్ట్రాన్ని ఆగం చేస్తుంది. ఇక కేసీఆర్ చూస్తూ కూర్చోడు. రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీగానే కాదు, ప్రధాన ప్రతిపక్షంగా మాకు ఎంతో బాధ్యత ఉంది. ఫ్రెండ్లీ పోలిసింగ్ పోయి పట్టపగలే జంట నగరాల్లో హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయి.
మాకు ఓటేయాల్సిన ప్రజలను దొంగ హామీలు, మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని గెలిచారు. కేసీఆర్ 2 వేలు ఇస్తే మేం 4 వేలు అన్నారు. తులం బంగారం, లక్ష రూపాయలు ఇస్తాంకొన్ని రోజులు పెండ్లి చేసుకోవద్దు అన్నారు. ఇప్పుడే బ్యాంకులో రుణాలు తెచ్చుకోండి. 2 లక్షల రుణమాఫీ అని మొత్తం 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని’ కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రైతు బంధు ఎగ్గొట్టారు. నిరుద్యోగ భృతి లేదు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. జాబ్ క్యాలెండర్లు లేవని విమర్శించారు.
కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ.. ‘పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలోకి జిల్లా ప్రాజెక్టులను చేర్చి పాలమూరును వెనక్కి నెట్టేశారు. అసలేం జరిగిందని గోదావరి, కృష్ణా ప్రాజెక్టులు ఏంటి. మనకు జరిగిన అన్యాయం ఏంటని గుర్తించాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువ అన్యాయం జరిగిందని పోరాటం మొదలుపెట్టాం. బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను తీసుకొచ్చి 6 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. నెట్టెంపాడులో భాగంగా చిన్న ప్రాజెక్టు మీద రివ్యూ చేసి 4 టీఎంసీలకు పెంచాం. కల్వకుర్తి, బీమా ఫేజ్ 1, 2, నెట్టెంపాడుల ద్వారా రైతుల పొలాలకు నీళ్లు అందించాం. 300 కిలోమీటర్లకు పైగా కృష్ణా నది పారుతున్నా 30 వేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. మిషన్ కాకతీయ ద్వారా అధిక ప్రాధాన్యం ఇచ్చి మిగతా జలాశయాలకు నీళ్లు ఉండేలా చేసి మరో లక్ష ఎకరాలకు నీళ్లు అందించాం. ఆర్డీఎస్ ద్వారాకోల్పోయిన ఆయకట్టును భర్తీ చేయడానికి తుమ్మిళ్ల లిఫ్ట్ మొదలుపెట్టి మరికొన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాం.
నీళ్లు సాధించుకునేందుకు చర్యలు తీసుకోని రాష్ట్ర ప్రభుత్వం
పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు కృష్ణా బేసిన్‌లో ఉన్నా బాధలు తప్పలేదు. అందుకే పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 170 టీఎంసీలు తీసుకోవాలి. ఏపీ నుంచి వచ్చే వ్యతిరేకత సమయంలో నికర లెక్కలు తెప్పించి గతంలో సామర్థ్యంఎంత, ఇప్పుడు ఎంత అనేది పరిశీలించి అప్పటికప్పుడూ 90.8 టీఎంసీలు కేటాయించాం. ఇంకా 80 వరకు టీఎంసీలు రావాలి. వైఎస్సార్ హయాంలో 80 టీఎంసీల వరకు వాడుకున్నారు. బచావత్ ప్రకారం 45 తెలంగాణకు, మహారాష్ట్రకు 14 టీఎంసీ, కర్ణాటకకు 21 టీఎంసీ తీసుకున్నారు. ప్రాజెక్టు డీపీఆర్ లో ఉంది. మైనర్ ఇరిగేషన్ లో లాస్ అవుతున్న 45 కలిపి మొత్తం 90 టీఎంసీలు రావాలని పాలమూరు, రంగారెడ్డికి 20వేల కోట్లు ఖర్చు చేయగా 80, 90 శాతం పనులు చేశాం. పోతిరెడ్డిపాడు, తెలుగు గంగ ప్రాజెక్టులతో ఏపీ వాళ్లు నీళ్లు తీసుకోవాలని చూస్తారు. దాంతో 145 మెగావాట్ల బీహెచ్ఈఎల్ పంపులను వాడాం. భారత్‌లో ఇదే తొలి పంపు. వర్షాలు లేకున్నా సమస్యలు ఉండొద్దని రిజర్వాయర్లు నింపుకుంటున్నాం.
తట్టెడు మట్టి తీయని దద్దమ్మ ప్రభుత్వం ఇదీ..
అంతలోనే ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారింది. ప్రజలు, రైతుల కోసం కొత్త ప్రభుత్వం పెండింగ్ పనులు పూర్తిచేయాలి. కానీ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదు. ప్రతిపనిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. మరోవైపు చంద్రబాబు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి ఇబ్బందిపెట్టేవారు. ఎన్విరాన్‌మెంట్ అసెస్మెంట్ కమిటీ పర్మిషన్ వచ్చింది. దాదాపు అనుమతులు వచ్చేస్తున్న సమయంలో చంద్రబాబు, నితీష్ కుమార్ అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు డీపీఆర్ ను వెనక్కి పంపింది. వడ్లు కొనకపోతే ఢిల్లీకి వెళ్లి ధర్నా చేసి కేంద్రం మెడలు వంచాం. కానీ ప్రాజెక్టు డీపీఆర్ వెనక్కి పంపితే సైలెంటుగా కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలి. ప్రజల కోసం, రైతుల కోసం పోరాటం చేయదా?. కొత్త రాష్ట్రాలకు కొంత ప్రయోజనం కల్పిస్తారు. లేకపోతే కేంద్రం ఆర్బిటరేషన్ ద్వారా సమస్య తీర్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాం.
సెక్షన్ 3 వేస్తాం. కేసు వెనక్కి తీసుకోవాలని అప్పటి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కోరాడంతో విత్ డ్రా చేసుకున్నాం. ఎవరికెంత వాటా రావాలో ట్రైబ్యునల్ తేల్చుతుంది. బ్రిజేష్ ట్రిబ్యునల్ 75 శాతాన్ని 65 శాతం డిపెండబిలిటీకి మార్చారు. దాంతో కృష్ణా నదిలో 811 టీఎంసీలు వచ్చాయి. బచావత్ బ్రిబ్యునల్ వచ్చాక 1005 టీఎంసీలకు పెరగడంతో మనకు వాటా వస్తుంది. ఓవరాల్ గా 160, 170 టీఎంసీలు వస్తాయని భావించాం. నియోజకవర్గానికి లక్ష ఎకరాలు లాగ మొత్తం 13.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయనుకున్నాం. తాజాగా కేంద్రం డీపీఆర్ వెనక్కి పంపితే దద్దమ్మ ప్రభుత్వం నోరు మూసుకుంది. ఇరిగేషన్ మంత్రి 45 టీఎంసీలకు నీళ్లు కావాలని కేంద్రానికి లేఖ ఎలా రాస్తాడు. హామీలు ఇవ్వడం కాదు, వాటిని అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా క్షేత్రంలో దోషిగా నిలబెడతామని’ అన్నారు.