KCR At Telangana Bhavan | హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో అత్యంత నష్టపోయిన ప్రాంతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అని, ఉమ్మడి పాలనలో ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చారని తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు.  ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణకు చేస్తున్న ద్రోహంపై చర్చించాం. కొత్త తరం వాళ్లకు చాలా విషయాలు తెలియవు. దారుణ వివక్షకు గురైన జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్. వనరులు, వసతులు ఉన్నా జిల్లాను అన్యాయం చేశారు. కృష్ణా నది ఎంటర్ అయ్యేది, 300కు పైగా కిలోమీటర్లు ప్రవహించేది పాలమూరులోనే. అయినా 50 ఏండ్లు పాలించినా కాంగ్రెస్, తరువాత టీడీపీ పాలనలో పాలమూరును కోలుకోలేని దెబ్బ కొట్టాయి.

Continues below advertisement

అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర ఎడమ కాలువ ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టులద్వారా ఆనాటికి 174 టీఎంసీలు పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు రావాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే తెలంగాణ పాలిట పెనుశాపంగా మారింది. అందులో మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం జరిగింది. ప్రతిపాదిత ప్రాజెక్టులను ఆపకూడదని ఎస్సార్సీ యాక్ట్ స్పష్టంగా చెప్పింది. కానీ అన్నింటిని నిలిపివేయడంతో అన్యాయం జరిగింది. మహబూబ్ నగర్ కు ఇచ్చే పాలమూరు ఎత్తిపోతల కొత్తది కాదు. గతంలోనే ఉన్న ప్రాజెక్టుకు ఇప్పుడు జీవం పోశాం. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ను కలిసి సమస్యను ఎన్నో రకాలుగా వారి దృష్టికి తీసుకెళ్లాం. అయితే మీకు రాష్ట్ర హోదా లేదని అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోలేమని చెప్పారు.

Continues below advertisement

బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిన సమయంలో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి బచావత్ ఏమన్నారంటే.. ఈ ప్రాంతం నిరాదరణకు గురవుతోందన్నారు. కానీ ఎవరూ అడిగేవాళ్లు లేరని సుమోటాగా తీసుకుని జురాల ప్రాజెక్టు అనుమతి ఇచ్చారు. దాన్ని మరో చోటుకు మార్చవద్దని 17 టీఎంసీలకు కేటాయించారు. 1974 నుంచి 1978 వరకు పర్మిషన్లు వచ్చినా పట్టించుకోలేదు. అంజయ్య సీఎం అయ్యాక దానికి శంకుస్థాపన చేసి అనాథలా వదిలేశారు. బ్యారేజీ వరకు కట్టారు. కానీ కాలువలు లేవు. నీళ్లు పారుతున్నా రైతులకు నీళ్లు అందవు. సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు మహబూబ్ నగర్ జిల్లాను దత్తత తీసుకుని ప్రాజెక్టులకు శంకుస్థాపన, శిలాఫలకాలు వేశారు. ఆ రాళ్లను కృష్ణానదిలో అడ్డం పెడితే ఓ చెక్ డ్యాం అవుతుందని చెబితే ప్రజలు చప్పట్లు కొట్టేవాళ్లు. నియోజకవర్గాలు, తాలుకాల నుంచి ముంబైకి వలస వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. 

దత్తత తీసుకుని పాలమూరును మోసం చేసిన చంద్రబాబు..

జిల్లాకు చెందిన కవి గోరటి వెంకన్న రైతుల సమస్యలు, నీటి కొరతపై పాటలు రాసి పాడారు. సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అని చంద్రబాబు సమావేశాల్లో చెప్పారు. జూరాలకు కొంత ముంపు ప్రాంతం కర్ణాటకలో ఉంది. మీరు దత్తత తీసుకున్న ప్రాంతమని నేను చంద్రబాబును అడిగితే రూ.13 కోట్లు కూడా కట్టలేదు. వదలకుండా నేను విమర్శలు చేస్తే తట్టుకోలేక చంద్రబాబు ఆ డబ్బులు కర్ణాటకకు కట్టారు. జోగులాంబ నుంచి గద్వాల వరకు తొలి పాదయాత్ర చేశాను. ఆర్డీఎస్ కెనాల్ 80 వేల ఎకరాలకు బదులు 10, 15 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందిస్తుంది. కర్ణాటకకు వెళ్లి కాలువ చెక్ చేశాకే మాట్లాడాను. జూరాల నుంచి ఆర్డీఎస్ కు లింక్ కెనాల్ అని చంద్రబాబు డ్రామాలు చేశారు. కానీ చుక్క నీళ్లు ఇవ్వలేదని’ కేసీఆర్ ఆరోపించారు.