TRS Kavitha : టీఆర్‌ఎస్‌... ఈ పేరుతో తెలంగాణకు ప్రత్యేకమైన అటాచ్‌మెంట్ ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ప్రత్యేక పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన పోరాటాలను కథల కథలుగా చెప్పుకుంటారు తెలంగాణ ప్రజలు. లేటెస్ట్ పాలిటిక్స్‌లో చాలా పార్టీలకు టీఆర్‌ఎస్ రోల్‌ మోడల్. ప్రత్యేక రాష్ట్ర సాధించిన పార్టీగా టీఆర్‌ఎస్‌కు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది. అయితే పార్టీని వేరే రాష్ట్రాల్లో విస్తరించాలనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర సమితిని, భారత రాష్ట్ర సమితిగా మార్చి సరికొత్త నినాదాన్ని అందుకున్నారు కేసీఆర్. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు తన కుమార్తె కవిత టీఆర్‌ఎస్‌ పేరుతో కొత్త పార్టీ పెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. 

Continues below advertisement

బంజారాహిల్స్‌లోని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె సమావేశం పెట్టింది ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై అయినా సరే రాజకీయంగా కూడా కొన్ని కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. తన పార్టీ గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు అందుబాటులో ఉందని, దాన్ని ఎవరైనా పెట్టుకోవచ్చని అన్నారు. తన పార్టీ ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల మేరకే నడుస్తుందని చెప్పారు. తమకు ఇతర రాష్ట్రాల సిద్ధాంతకర్తలు అవసరం లేదని స్పష్టం చేశారు. 

టీఆర్‌ఎస్‌ ఫ్రీ అయిందని చెప్పడం వెనుక కవిత పార్టీ పేరు అదే అయి ఉంటుందని ప్రచారం మొదలైంది. ఈ నెలాఖరున పార్టీ పేరు అజెండా ప్రకటిస్తానంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఈ పేరును వదిలేసిన బీఆర్‌ఎస్‌ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది. ప్రజల్లో వచ్చే స్పందన ఏలా ఉంటుందనే విషయాల గురించి తెలుసుకునేందుకు మీడియా సమావేశంలో కవిత ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటారని విశ్లేషకులు అంటున్నారు. 

Continues below advertisement

టీఆర్‌ఎస్ చరిత్ర ఏంటీ?

2001లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతో విభేదించి 2001 ఏప్రిల్‌ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని హైదరాబాద్‌లోని జలదృశ్యంలో కేసీఆర్ స్థాపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ప్రజలను జాగృతం చేయడానికి పార్టీ ఏర్పాటు చేశారు. అనుకున్నట్టుగానే రాష్ట్రాన్ని సాధించారు. అనంతరం 2014, 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. 2022 అక్టోబర్‌ 5న పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. దీన్ని 2022 డిసెంబర్‌లో ఎన్నికల సంఘం ఆమోదించింది. 

ఆ తర్వాత ఏడాది జరిగిన 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమిపాలైంది. ఆ పార్టీకి ప్రజలు 39 సీట్లు మాత్రమే ఇచ్చారు. 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. తర్వాత జరిగి వరుస పరిణామాలతో పార్టీ పేరును మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చాలనే చర్చ వచ్చింది. అయితే తమకు అలాంటి ఆలోచన లేదని పార్టీ అగ్రనాయకత్వం చెబుతూ వచ్చింది. 

ఇప్పుడు ఆ టీఆర్‌ఎస్ పేరుతో పార్టీ పెట్టేందుకు కవిత రెడీ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. కవిత తెలంగాణ జాగృతిని నడుపుతున్నారు. అది కలిసి వచ్చేలా తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. ఈ విషయంలో కోర్టులను కూడా ఆశ్రయించారు. కానీ ఇంతలో ఆమె ఇవాల్టి ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలతో టీఆర్‌ఎస్ పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారా అనే చర్చ మొదలైంది.  

బీఆర్‌ఎస్‌ విభేదించి వేరే పార్టీ పెట్టుకునేందుకు సిద్ధమవుతున్న కవిత ఒకవేళ టీఆర్‌ఎస్ పేరుతో వస్తే తమకు భారీ నష్టం కలుగుతుందని భావిస్తే కచ్చితంగా ఆ పార్టీ లీడర్లు అన్ని విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే జరిగితే కవిత పేరు మారుమాగుతుంది. ఆమెకు మేలు జరిగే ఆస్కారం ఉంది. వాళ్ల నుంచి అభ్యంతరం రాకపోతే టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఉండే ఎమోషన్‌కు కవిత ఉపయోగించుకునే ఛాన్స్ లేకపోలేదు.