తెలంగాణలో ‘ఇంటింటికీ తెలుగు దేశం’ కార్యక్రమం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తెలుగు దేశం వచ్చాకే తెలంగాణలో మొదటిసారి అన్నం వండుకు తిన్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని, మూర్ఖపు అహంకారానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. దేశంలోనే తొలిసారి వరి అన్నం తిన్న ప్రజలు తెలంగాణ వారేనని చెప్పారు. 11వ శతాబ్దం నాటికే కాకతీయుల కాలంలో నిర్మించబడ్డ గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణలో వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, అల్లం, పసుపు, ఉల్లి, చెరుకు పంటలు పండించారన్నారు. 15వ శతాబ్దం నాటికి బియ్యంతో చేసే హైదరాబాద్ దమ్ బిర్యానీ ప్రసిద్ధి అని గుర్తు చేశారు.
మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చంద్రబాబు మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు ఉలిక్కిపడుతున్నారని కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు ఏం జరిగిందన్న విషయమే చంద్రబాబు ప్రస్తావించారు తప్ప.. మరొకటి కాదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇచ్చి పేదల కడుపు నింపారని ఆయన గుర్తుచేశారు. ధమ్ కా బిర్యానీ ఎక్కడ దొరుకుతుందో నిరంజన్ రెడ్డి చెప్పాలి? అని కాసాని ప్రశ్నించారు. ఎవరి పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందో ప్రజలకు తెలుసని అన్నారు. అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు పంపిణీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఒక్క మీటింగ్ పెడితే బీఆర్ఎస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.
అధికార పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కాసాని జ్ఞానేశ్వర్ ప్రశ్నించారు. మంత్రి నిరంజన్ రెడ్డి సొంత ప్రాంతం నుంచి ఇంకా వలసలు కొనసాగుతున్నాయని ఎద్దేవా చేశారు. బియ్యంపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను వక్రీకరించారని కాసాని జ్ఞానేశ్వర్ మండిపడ్డారు.
తొలిసారిగా వరి అన్నం తెలంగాణలోనే - మంత్రి
‘‘భారతదేశంలోనే తొలి వరి అన్నం తిన్న ప్రజలు తెలంగాణ ప్రజలు. ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించిన నేల తెలంగాణ. అప్పట్లోనే విష్ణు కుండినుల నుండి కాకతీయులు, ఆ తర్వాత నిజాంల దాక గొలుసు కట్టు చెరువుల నిర్మాణంతో వ్యవసాయవృద్ధికి బాటలు వేశారు. బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమంలో అనేక సార్లు ప్రస్తావించారు. అక్కసు, అక్రోశం, విద్వేషం, వివక్ష, అన్యాయాలు తెలంగాణ ఉద్యమానికి పునాది’’ అని మంత్రి సింగిరెడ్డి గుర్తు చేశారు.
1956లో ఆంధ్రాలో తెలంగాణ విలీనమే తెలంగాణ వినాశనానికి బీజం. చెరువులు, కుంటలను ధ్వంసం చేశారు. అప్పటికే ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. దశాబ్దాల పాటు ప్రాజెక్టుల నిర్మాణం సాగదీశారు. ప్రాజెక్టులు కడుతున్నట్లు, సాగునీరు ఇస్తున్నట్లు ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టారు. వైభవంగా ఉన్న తెలంగాణ జీవితాలను సమైక్య పాలనలో చెల్లాచెదురు చేశారు. గ్రామాల్లో ఉపాధి కరువై ముంబై, దుబాయి బాట పట్టేలా చేశారు. ఆఖరుకు రూ.2కు కిలోబియ్యం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకునే దుస్థితికి తీసుకువచ్చారు." అని నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇష్టానుసారం తెలంగాణ గురించి మాట్లాడితే సహించేది లేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బేషరతుగా తెలంగాణ ప్రజలు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.