Kaleshwaram Commission | హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరంపై విచారణ కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌లకు నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో, బీఆర్ఎస్ పాలన సమయంలో కేసీఆర్ సీఎం కాగా, నీటిపారుదలశాఖా మంత్రిగా హరీష్ రావు, ఆర్థికశాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేశారు.
జూన్‌లో విచారణకు డెడ్ లైన్
15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులలో కమిషన్ పేర్కొంది. జూన్ 5వ తేదీలోగా విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ డెడ్‌లైన్ ఇచ్చింది. జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటల రాజేందర్‌లను విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం విచారణ కమిషన్ గడువును ఇటీవల పొడిగించింది. ఇప్పటివరకూ 7 పర్యాయాలు కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్‌గా 2024 మార్చిలో కమిషన్ ఏర్పాటైంది.
కాళేశ్వరం ప్రాజెక్టులలో అవకతవకలు, లోపాలు, నాణ్యత పరమైన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. కమిషన్ ఇదివరకే 109 మంది అధికారులు, ఉద్యోగులు, సంబంధిత వ్యక్తులను విచారించి పలు వివరాలు సేకరించింది. ప్రాజెక్టులో కీలకమైన అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటలను విచారించి మరిన్ని వివరాలు సేకరించాలని కాళేశ్వరం భావిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది.