మైనంపల్లి హనుమంతరావు కొట్టిన దెబ్బను కేసీఆర్‌కు రుచి చూపించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తాజా జాబితాలో టికెట్ రాని పట్నం మహేందర్ రెడ్డి కూడా తన పౌరుషం చూపించాలని అన్నారు. ఎల్లప్పుడూ ఆత్మగౌరవం, రోషం, పౌరుషంతో ఉండాలని పట్నం మహేందర్ రెడ్డిని కోరారు. కేసీఆర్‌కు దిమ్మ తిరగాలని అన్నారు. కానీ, మహేందర్ రెడ్డిని బుజ్జగించేందుకు కేసీఆర్ మంత్రి పదవి ఇస్తున్నాడని అన్నారు. నేడు (ఆగస్టు 22) జూపల్లి గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు.
తాను తన సొంత నియోజకవర్గం కొల్లాపూర్ నుంచే పోటీ చేస్తానని అన్నారు. కేసీఆర్ లాగా తాను ఎక్కడికీ పారిపోబోనని అన్నారు. కాళేశ్వరం కన్నా ముందే పాలమూరు ప్రాజెక్టును మొదలు పెట్టినప్పటికీ దాన్ని ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు వచ్చినప్పుడు గేట్లు తెరుచుకోవని అన్నారు. అప్పుడు వారి ఆత్మగౌరవం ఎక్కడికి పోవాలని అన్నారు. గాంధీభవన్లో, ఢిల్లీ ఏఐసీసీలో కూడా టికెట్ల కోసం కొట్టుకుంటామని, తమకు ఆ స్వేచ్ఛ ఉందని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి, నెహ్రు కుటుంబానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారంటే ఓటమిని అంగీకరించినట్టే కదా అని అన్నారు.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ అనంతరం ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సినిమా ఇక ఆఖరి దశకు వచ్చిందని అన్నారు. గత 9 ఏళ్ల నుంచి ప్రభుత్వాన్ని చూసి ప్రజలు విసిగిపోయారని అన్నారు. ప్రజల దగ్గర దోచుకున్న డబ్బులనే ఓటర్లకు పంచి ఇస్తూ.. ఓట్లు కొంటున్నారని ఆరోపించారు. ప్రజలు కూడా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పిలుపు ఇచ్చారు.
కేసీఆర్ పాలనలో పారదర్శకత లేదని, ఆయన పాలన పైన పటారం లోన లొటారం తరహాలో ఉందని విమర్శించారు. పాలమూరు జిల్లాలో టీఆర్‌ఎస్‌కు గతంలో ఉనికే లేదని అన్నారు. గత ఎన్నికల్లో తన ఓటమికి చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చి నాలుగు నెలల ముందే వైన్ షాపుల టెండర్లు పిలిచారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో రూ.వందల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ప్రపంచంలోనే అంత ఖర్చు ఎవరూ పెట్టలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా అలానే ఖర్చు పెడతారని చెప్పారు.