జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య వివాదం నెలకొంది. నియోజకవర్గానికి వచ్చిన ఆ పార్టీ నేత, క్రికెటర్ అజారుద్దీన్ పర్యటనపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరబండ, మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీఆర్ హిల్స్ లో జరిగిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి మాజీ భారత కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ వచ్చారు. ఈయన్ను మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ అభిమానులు అడ్డుకున్నారు. విష్ణు వర్ధన్ రెడ్డి వర్గీయులకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటించడంపై విష్ణువర్థన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విష్ణువర్థన్ మాట్లాడుతూ.. క్రికెటర్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి తమకు చెప్పి రాకపోవడం తప్పుగా భావిస్తున్నానని అన్నారు. స్కామ్ లో ఉన్న అజారుద్దీన్ మరోసారి నియోజకవర్గానికి వస్తే, తమకు సమాచారం ఇవ్వాలని, అలా చేస్తే రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తామని అన్నారు. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే మనసత్వం తనదని అన్నారు.
ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన తమ కుటుంబాన్ని అవమానిస్తే సహించేది లేదని అన్నారు. తన తండ్రి పి.జనార్దన్ రెడ్డి 30 సంవత్సరాలు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. తాను కూడా 16 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఉంటున్నానని చెప్పారు. అలాంటి తనకు కాకుండా వేరే ఒకరికి టికెట్ ఇస్తే సహించేది లేదని విష్ణువర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు.
వెనుదిరిగిన అజారుద్దీన్
మాజీ ఎంపీకి ప్రోటోకాల్ ఇవ్వలేని మీ పోలీసులు ఏం పని చేస్తున్నారు అంటూ అజారుద్దీన్ తరపున ఉన్న కాంగ్రెస్ కార్యకర్త నిలదీశారు. పోలీసులపై అజారుద్దీన్ అగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. ఈ విషయంలో విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులకు అజారుద్దీన్ అనుచరులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది.