కేంద్ర బడ్జెట్ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌ దూకుడు పెంచారు. బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారానికి కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. దీనికి బీజేపేతర పార్టీలు ఒక్కొక్కరుగా మద్దతు ప్రకటిస్తున్నారు. సోమవారం బెంగాల్ సీఎం మమత బెనర్జీ కాల్‌ చేసి భవిష్యత్‌ వ్యూహాలపై చర్చించారు. ఇప్పుడు మాజీ ప్రధాని దేవగౌడ ఫోన్ చేశారు. 


కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మద్దతు పెరుగుతోంది. మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్.డి. దేవెగౌడ ఫోన్ చేశారు. సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు సిఎం కెసిఆర్‌ను అభినందించారు. 






" రావు సాబ్...మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. మతతత్వ శక్తుల మీద ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందే. దేశ లౌకికవాద సంస్క్రతిని, దేశాన్ని  కాపాడుకునేందుకు మీమందరం మీకు అండగా ఉంటాం.. మీ యుద్దాన్ని కొనసాగించండి. మా సంపూర్ణమద్దతు మీకు ఉంటుంది." అన్నట్టు తెలంగాణ సీఎంవో ప్రకటన విడుదల చేసింది. 


దేవగౌడతో ధన్యవాదాలు తెలిపిన సీఎం కేసీఆర్‌.. దీనిపై మరింత లోతుంగా చర్చించాలని వీలైతే బెంగళూరు వచ్చి సమావేశమవతానని చెప్పినట్టు తెలుస్తోంది. ఎప్పుడైనా రావచ్చని కేసీఆర్‌ను దేవగౌడ ఆహ్వానించినట్టు సమాచారం. 


నిన్న మమతా బెనర్జీ కూడా ఫోన్ చేసి మాట్లాడారు. ఇలా  బీజేపీకి  వ్యతిరేకంగా నేతలంతా స్వరం ఎత్తడం ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే తీవ్ర చర్చకు దారి తీసింది. నిధుల విషయంలో వివపక్ష చూపిస్తున్న కేంద్రం... పెత్తనం విషయం మాత్రం ముందంజలో ఉందంటూ నేతలంతా మండిపడుతున్నారు. మొన్న గవర్నర్‌ వ్యవస్థపై స్టాలిన్‌తో బెంగాల్‌ సీఎం మమత మాట్లాడారు. 


కేసీఆర్‌ కూడా బీజేపీ బండారం ఒక్కొక్కటిగా బయటపెడతామంటూ గతంలోనే చెప్పారు. మొన్న సర్జికల్‌స్ట్రైక్‌, రఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై గట్టిగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో అసలు సినిమా ఉందంటు గట్టిగానే బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు కేసీఆర్‌ తర్వాత స్టెప్‌ ఏం తీసుకుంటారనే ఆసక్తి అందరిలో నెలకొంది.