వైజాగ్‌ వేదికగా పవన్‌ కల్యాణ్‌పై దాడి చేసేందుకు కొందరు కుట్ర చేశారంటూ బాంబు పేల్చిన జనసేన.. ఇప్పుడు మరో సంచలన ఆరోపణలు చేస్తోంది. పవన్ కల్యాణ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారంటూ కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది. 


జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రమాదంలో ఉన్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది జనసేన. ఆయన ఇంటి నుంచి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారని ఆరోపిస్తోంది. టూవీలర్స్‌, ఇతర వాహనాల్లో వెంబడిస్తున్నారని ఆవేదన చెందుతోంది. 


హైదరాబాద్‌లో పవన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని ప్రకటించింది జనసేన. ఇదంతా అనుమానాస్పదంగా ఉందని ఆరోపిస్తోంది. నాదేండ్ల మనోహర్ పేరుతో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో తీవ్ర ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేసింది. 


విశాఖ సంఘటన తర్వాత పవన్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర చాలా మంది అనుమానాస్పదంగా తిరుగుతున్నారని మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వాహనాన్ని  అనుసరిస్తున్నారన్నారు. కారులోని వ్యక్తులు పవన్ కల్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. 






ఇలా పవన్‌ కల్యాణ్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తున్న వాళ్లెవరూ అభిమానులు మా

త్రం కాదని అంటున్నారు మనోహర్. పవన్ కల్యాణ్ వ్యక్తిగత రక్షణ  సిబ్బంది కూడా ఇదే చెబుతున్నారని వివరించారు. అలా అనుసరిస్తున్న వారి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. బుధవారం కారులోనూ, మంగళవారం నాడు  ద్విచక్రవాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు అనుసరించారన్నారు. 






సోమవారం అర్థరాత్రి కూడా ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారని తెలిపారు మనోహర్‌. ఇంటికి ఎదురుగా కారు ఆపి గలాటా చేశారన్నారు. సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడ్డారని వెల్లడించారు. వారిని బూతులు తిడుతూ దుర్భాషలాడినట్టు పేర్కొన్నారు. 


పవన్ ఇంటి వద్ద గలాటా చేసిన వ్యక్తులు... అక్కడ ఉండే సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని తెలిపారు మనోహర్. రెక్కీకి వచ్చిన వాళ్లు సిబ్బందిని ఎంతలా కవ్వించినా సంయమనం పాటించారన్నారు. ఈ సంఘటనను వీడియో తీసి  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు వివరించారు.