Pawan Kalyan And Ramoji Rao: రామోజీ సంస్థల ఛైర్మన్ రామోజీరావు ఆకస్మిక మృతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచిన రామోజీ మృతి తెలుగు సమాజానికి తీరని లోటుగా అభివర్ణించారు. "అక్షర యోధుడు రామోజీరావు తుది శ్వాస విడిచారని తెలిసి చాలా బాధ కలుగుతోంది. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకుంటారని భావించాం. ఆయన ఇక లేరనే వార్త అవేదన కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని కోరుకుంటున్నాను.  ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనం. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ జనచైతన్యాన్ని కలిగించారు. 


వర్తమాన రాజకీయాలు, పాలన తీరుతెన్నులపై నిష్కర్షగా వార్తలను అందించడమే కాదు.. ఆ వార్తలను ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థ ఏర్పాటు చేయడం రామోజీరావు దక్షతకు నిదర్శనం. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. పత్రికాధిపతిగా కాకుండా సినీ నిర్మాతగా, స్డూడియో నిర్వాహకులుగా వ్యపారవేత్తగా బహుముఖంగా విజయాలు సాధించారు. 


రామోజీ ఫిల్మిసిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను వేదికగా చేశారు. మీడియా మొఘల్‌గా రామోజీరావు అలుపెరగని పోరాటం చేశారు. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్లడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత సాధించారు. అక్షర యోధుడు రామోజీరావు అస్తమయం తెలుగు ప్రజలందరికీ కలచి వేస్తోంది. ఆయన స్ఫూర్తిని నవతరం పాత్రికేయులు అందిపుచ్చుకోవాలి.