Jagga Reddy on Rahul Gandhi: రాహుల్ గాంధీ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటుందని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. వారు అధికారం కోసం అడ్డదారులు తొక్కబోరని అన్నారు. తాను ఒక కాంగ్రెస్ అభిమానిగా రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ రాజు అని.. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడినా గెలిచినా ఆయన రాజే అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం (ఏప్రిల్ 9) గాంధీభవన్ లో ఉగాది వేడుకల అనంతరం జగ్గారెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. 


రాహుల్ గాంధీ అధికారం కోసం అడ్డదారులు తొక్కరని జగ్గారెడ్డి అన్నారు. జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలనేది మోదీ, అమిత్ షా విధానమని అన్నారు. ప్రశాంత్ కిషోర్ ఓ సారి బీజేపీ అంటారని, ఇంకోసారి కాంగ్రెస్ అంటుంటారని అన్నారు. ఆయన బతుకుదెరువు కోసం సర్వే సంస్థను పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ అధికారంలోకి వస్తారని పీకే చెప్పారని కానీ కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ అని అన్నారు. పార్టీకి రాజ పూజ్యం 16 ఉంటే.. అవమానం 2 ఉందని చెప్పారు.


పీసీసీ చీఫ్ పదవిపైనా కీలక వ్యాఖ్యలు
పీసీసీ చీఫ్‌ పదవి పైన కూడా జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ పోస్టును తాను అడగడం ఇదేం కొత్త కాదని అన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి తాను పీసీసీ పదవిని అడుగుతూనే ఉంటానని అన్నారు. తాను ఆ పదవిని కోరుకోవడం కొత్త కాదని.. అడగడం తప్పు కాదని వ్యాఖ్యానించారు. ఇప్పటి పరిస్థితుల్లో తెలంగాణ పీసీసీ మార్పునకు ఇంకా సమయం ఉందని అన్నారు. ఇప్పుడు దానికే తొందర లేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత అధిష్ఠానం దాని గురించి ఆలోచిస్తుందని చెప్పారు. పీసీసీ, సీఎం ఒక్కరే అయి ఉంటే బాగుంటుందని అదే విధానం కొనసాగుతుందని జగ్గారెడ్డి చెప్పారు.


మందక్రిష్ణ మాదిగపైనా..
మందకృష్ణ మాదిగ బీజేపీ కోటరీలో ఉండి మాట్లాడుతున్నాడని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మాదిగలు అని.. మాదిగలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. దామోదర రాజనర్సింహకు, మీరా కుమార్‌కు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. బీజేపీకి లాభం చేకూర్చేలా మంద కృష్ణమాదిగ మాట్లాడుతున్నారని అన్నారు. బీజేపీని తెలంగాణలో మాదిగను రాజ్యసభ సభ్యుడిని చేయమని ఎందుకు అడగలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కేంద్ర మంత్రిని అయినా చేయాలని డిమాండ్ చేయొచ్చు కదా అని నిలదీశారు.