TS Secretariat launch: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోని సచివాలయంలోనే కేసీఆర్ సారథ్యంలోని తొలి ప్రభుత్వం పరిపాలనను ప్రారంభించింది. రాష్ట్ర పరిపాలనకు ఆయువుపట్టుగా భావించే పాత సచివాలయంలో కాలానుకూలంగా ఏర్పాటు చేసుకోవాల్సిన వసతుల లేమితో సచివాలయ ఉద్యోగులు, సందర్శకుల రకకరాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం దృష్టికి వచ్చింది. తరుచూ పై కప్పు పెచ్చులు ఊడిపడడం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సమస్యలు తలెత్తడం, అన్ని వసతరులతో క్యాంటీన్ ఏర్పాటుకు స్థలం లేమి, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం తదితర ఇబ్బందులతో పాలనాపరమైన సమస్యలు, శాఖల మధ్య సమన్వయ లోపం వంటి ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో పాత సచివాలయం స్థానంలోనే రాష్ట్ర పాలనకు కేంద్రమైన కొత్త సచివాలయాన్ని దేశంలోనే అత్యద్భుతంగా నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు.
పాత సచివాలయం స్థితిగతులపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినేట్ సబ్ కమిటి వేశారు. ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన సబ్ కమిటి పాత సచివాలయం కండీషన్ బాగా లేదని సీఎం కేసీఆర్ కు నివేదిక సమర్పించింది. దాంతో పాత సచివాలయం తొలగింపు – నూతన సచివాలయం ఏర్పాటుపై నిపుణుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సమగ్ర అధ్యయనంచేసి పలు లోపాలను గుర్తించి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఉన్నత ప్రమాణాలతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నివేదిక ఇచ్చింది.
అనంతరం నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ 2019 జూన్ 27న కొత్త సచివాలయం భవన నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. సచివాలయ నిర్మాణానికి డాక్టర్ ఆస్కార్, పొన్ని కాన్సెస్సావో అనే ప్రఖ్యాత ఆర్కిటెక్టులు డిజైనర్లుగా వ్యవహరించారు. సీఎం కేసీఆర్ ఆమోదించిన ప్రస్తుత నమూనాతో నూతన సచివాలయం రూపుదిద్దుకున్నది. షాపూర్ జీ పల్లోంజి అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సచివాలయన్ని నిర్మించే కాంట్రాక్టును దక్కించుకొని అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టింది.
నూతన సచివాలయ భవనం డిజైన్ కు ప్రేరణ:
నిజామాబాదులోని కాకతీయుల కాలంనాటి నీలకంఠేశ్వరస్వామి దేవాలయం, వనపర్తి సంస్థానపు రాజప్రాసాదాల్లోని శైలులు-అక్కడి గోపురాలు, గుజరాత్ లోని సారంగాపూర్ హనుమాన్ దేవాలయ శైలుల ఆధారంగానే సచివాలయం గుమ్మటాల నిర్మాణాలు జరిగాయి. బయటివైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నింటినీ ఎర్ర ఇసుకరాతితోనూ, మధ్యనున్న శిఖరం లాంటి బురుజును రాజస్థాన్ లోని ధోల్పూర్ నుంచి తెచ్చిన ఇసుకరాతితో నిర్మించారు. నూతన సచివాలయానికి తూర్పున లుంబినీవనం, అమరజ్యోతి.. పశ్చిమాన మింట్ కాంపాండ్, ఉత్తరాన అంబేద్కర్ విగ్రహం, దక్షిణాన రవీంద్రభారతి రోడ్డు ఉన్నాయి.
సచివాలయం విస్తీర్ణం వివరాలు
- మొత్తం భూ విస్తీర్ణం : 28 ఎకరాలు
- భవనం నిర్మించిన ఏరియా : 2.45 ఎకరాలు
- ల్యాండ్ స్కేపింగ్ : 7.72 ఎకరాలు
- సెంట్రల్ కోర్ట్ యార్డ్ లాన్ : 2.2 ఎకరాలు
- పార్కింగ్ : 560 కార్లు, 700 బైక్‌లు పట్టేంత
- యాన్సిలరీ బిల్డింగ్ ఏరియా : 67,982 చ.అ.
- ప్రధాన భవన కాంప్లెక్స్ బిల్టప్ ఏరియా : 8,58,530 చ.అ.
- లోయర్ గ్రౌండ్ + గ్రౌండ్ + ఆరు అంతస్తుల్లో ఒక్కోదాని ఎత్తు : 14 అడుగులు
- అశోక చిహ్నం మొత్తం ఎత్తు : 265 అడుగులు
- భవనం పొడవు, వెడల్పు : 600 X 300
- ప్రధాన గుమ్మటాలు (స్కైలాంజ్) : 11వ అంతస్థు