IndiGo Flights Cancelled:ఇండిగో సర్వీస్‌లు వరుసగా బ్రేక్‌డౌన్ అవుతున్నాయి. గురువారం ఐదు వందలకుపైగా సర్వీస్‌లు నిలిచిపోయాయి. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. సాంకేతిక కారణాలతోనే ఇదంతా జరుగుతోందని ఇండిగో సంస్థ ప్రకటించింది. ఇండిగో సంస్థ తీరుపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ సంస్థకు వ్యతిరేకంగా శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాములు నిరసన చేపట్టారు. 

Continues below advertisement

వందల మంది భక్తులు శబరిమలై వెళ్లేందుకు విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. మరికొందరు కేరళ నుంచి వివిధ ప్రాంతాలకు వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. అయితే గురువారం నుంచి వారు బయల్దేరాల్సిన విమానాలు రద్దు చేస్తున్నట్టు ఇండిగో సంస్థ ప్రకటించింది. అయితే వారంతా తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు ముందుగానే విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ దాదాపు గంటలు గడుస్తున్నా తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో స్వాములు ఆందోళన చేపట్టారు. విశాఖ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కేరళ అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. స్వాములతోపాటు సామాన్య భక్తులు కూడా ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నారు. 

శంషాబాద్‌లో స్వాములు, సామాన్య ప్రయాణికుల సమస్యలను ఏపీ మంత్రి పార్థసారథి  తెలుసుకున్నారు. వారి దుస్థితి గురించి కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో మాట్లాడారు. గురువారం నుంచి ఎయిర్‌పోర్టులోనే స్వాములు పడిగాపులు కాస్తున్నారని వివరించారు. వారి సమస్యను తెలుసుకున్న రామ్మోహన్ వెంటనే ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. శబరిమలైకు వెళ్లేందుకు ప్రత్యేక సర్వీస్‌ ఏర్పాటు చేయించారు. ఇద్దరు మంత్రులకు స్వాములు కృతజ్ఞత తెలిపారు.  

హైదరాబాద్‌ నుంచి వెళ్లాల్సిన దాదాపు వంద విమానాలను ఇండిగో రద్దు చేసింది. బెంగళూరు నుంచి బయల్దేరాల్సిన వందుకుపైగా విమానాలను కూడా రద్దు చేసింది. ఇలా వందల సంఖ్యలో సర్వీస్‌లను రద్దు చేస్తుండటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దు చేస్తున్నామని సమాచారాన్ని అకస్మాత్తుగా ఇచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదని మండిపడుతున్నారు. ఏమైనా అడిగితే సాంకేతిక లోపం ఉందని, సిబ్బంది కొరత ఉందని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. 

వందల సంఖ్యలో ఇండిగో విమాన సర్వీస్‌లు రద్దు కావడంతో మిగతా విమానయాన సంస్థలు రేట్లను విపరీతంగా పెంచేశాయి. దీంతో ఎమర్జెన్సీగా గమ్యస్థానాలకు వెళ్లవలసిన వాళ్లు విధిలేని పరిస్థితులు ఎక్కువ ధరకు టికెట్లు కొని వెళ్తున్నారు. ఇండిగో కారణంగా విమానాశ్రయాల్లో నెలకొన్న పరిస్థితిని విమానయానశాఖ పరిశీలిస్తోంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తిందో వివరించాలని ఇండిగో సంస్థను ప్రశ్నించింది.