Draupadi Murmu: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జీ. రాఘన రెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి ఈ మెయిల్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. శీతకాల విడిది కోసం హైదరాబాద్‌‌కి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞా రెడ్డి ఈ - మెయిల్‌ ద్వారా  తనకు న్యాయం చేయాలని లేఖ రాసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మెయిల్ పై రాష్ట్రపతి భవన్ స్పందించింది. తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అండర్ సెక్రటరీ పీసీ మీనా ప్రభుత్వానికి మెయిల్ పంపారు. ప్రజ్ఞ ఫిర్యాదుపై ఏ చర్యలు తీసుకున్నారో తమకు తెలపాలంటూ అందులో ఆదేశించారు. ఈ పరిణామంతో ప్రజ్ఞ కుటుంబ సభ్యులు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. 


రెండేళ్లుగా తనతో పాటు తన కూతురిని వేధిస్తున్నారంటూ..!


శీతకాల విడిది కోసం హైదరాబాద్‌‌కి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞా రెడ్డి ఈ - మెయిల్‌ ద్వారా లేఖ రాశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. పుల్లారెడ్డి గ్రూపునకు చెందిన జి.నారాయణమ్మ కాలేజీకి రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో ఆమె ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 29న జి.నారాయణమ్మ కాలేజీలో రాష్ట్రపతి పర్యటనను రాఘవ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ లేఖ సోమవారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
రాఘవ రెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డి, కుమార్తె శ్రీవిద్య రెడ్డి రెండేళ్లుగా తనతోపాటు తన 8 ఏళ్ల కుమార్తెను వేధిస్తున్నారని ప్రజ్ఞా రెడ్డి రాష్ట్రపతికి రాసిన లేఖలో వివరించారు.


అత్తింటి వారిపై హైదరాబాద్ లో కేసులున్నాయని..


వాళ్లు తమను చంపేందుకు ప్రయత్నించారని, వరకట్నం తేవాలని పదే పదే హింసలు పెట్టేవారని ఆరోపించారు. తమను ఇంటి నుంచి బయటకి రాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి ఇంట్లోనే తన గది బయట గోడ కట్టించారని లేఖలో వాపోయారు. ఈ విషయం కోర్టుకు కూడా వెళ్లిందని గుర్తు చేశారు. కోర్టు కూడా కట్టిన గోడను కూల్చి వేయాలని ఆదేశించిందని చెప్పారు. ఇవి తాను చేస్తున్న ఆరోపణలు కాదని.. ఈ విషయం కోర్టులో వరకు వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి గది బయట గోడ కూల్చి వేయమని ఆదేశించారని ప్రజ్ఞ చెప్పుకొచ్చారు. తన మెయిల్‌లో కోర్టు ఆదేశాల మేరకు గది బయట గోడను కూలగొడుతున్న అధికారుల వీడియోను కూడా జత చేశారు. తనను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్న అత్తింటి వారిపై ఇప్పటికే హైదరాబాద్‌లో కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. సాటి మహిళగా తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఈ - మెయిల్ ద్వారా రాసిన లేఖలో రాష్ట్రపతిని వేడుకున్నారు. ఈ నెల 29న రాఘవ రెడ్డికి చెందిన జి. నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో మీ పర్యటనతో మరింత రెచ్చిపోతారని ప్రజ్ఞా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పర్యటనను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని వాపోయారు.