India Independence Day 2025: 1947, ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందింది. భారతజాతి ఆంగ్లేయుల సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు అది. దేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు అంబరాన్ని తాకాయి. కానీ హైదరాబాద్ సంస్థానంలో మాత్రం ప్రజలు మువ్వన్నెల జెండాను అర్థరాత్రి రహస్యంగా ఎగురవేయాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు 1947 ఆగస్టు 15న తెలంగాణలో ఏం జరిగిందో తెలుసా? ఈ పూర్తి కథనం చదివితే నాటి హైదరాబాద్ సంస్థానం పరిస్థితి ఏంటో అర్థం అవుతుంది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, హైదరాబాద్ మాత్రం నిజాం పాలనలోనే
ఆంగ్లేయులు భారతదేశం అంతటా తమ పాలన సాగించినా, వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణ నిజాం పాలనలో ఉండేది. 1947, ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి పొందింది. అయితే, నాటి బ్రిటన్ పాలకులు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినా, దేశంలోని 500 పైచిలుకు సంస్థానాలకు మాత్రం భారతదేశంలో ఉండాలా వద్దా అన్నది వారి ఇష్టమనే రీతిలో చట్టంలో అవకాశం కల్పించారు. దీంతో నాటి నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేయడానికి నిరాకరించారు. సరిగ్గా భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన ఆగస్టు 15, 1947న తమ రాజ్యం స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించారు. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
నాడు హైదరాబాద్ సంస్థానంలో ఏం జరిగిందంటే..?
నిజాం ప్రకటనతో హైదరాబాద్ సంస్థానంలో ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు. హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా పిలుపునిచ్చింది. నాటి కాంగ్రెస్ నేత స్వామి రామానంద తీర్థ, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని హైదరాబాద్ సంస్థాన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయనతో పాటు బూర్గుల రామకృష్ణారావు వంటి నేతలు సైతం ప్రజలను ఉద్యమం కోసం సమాయత్తం చేయసాగారు. నిజాం పాలన వీరిని అరెస్టు చేసి జైలుకు పంపింది. అప్పటికే కమ్యూనిస్ట్ నేతల ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతోంది. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం చేయనని నిజాం ప్రకటనతో కమ్యూనిస్టులు పోరాటం తీవ్రతరం చేశారు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటి నేతల ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో గెరిల్లా దాడులకు దిగారు. చాలా గ్రామాల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో గ్రామ రాజ్యాలు స్థాపించారు. భూస్వాముల భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిజాంకు అండగా ఉన్న ఖాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల బృందం గ్రామాలపై పడింది. వారిని నిలువరించి ప్రజలకు అండగా కమ్యూనిస్టులు నిలిచారు.
తన ప్రసంగాలతో రజాకార్లను రెచ్చగొట్టిన ఖాసిం రజ్వీ
హైదరాబాద్ సంస్థానంలో జాతీయ జెండా ఎగురవేసే ప్రజలపై హింసకు దిగిన రజాకార్లకు మద్దతుగా వారి నాయకుడు ఖాసిం రజ్వీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. హైదరాబాద్ సంస్థానం ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశంలో విలీనం కాబోదని ప్రకటించారు. చివరి రక్తపు బొట్టు వరకు హైదరాబాద్ సంస్థానాన్ని కాపాడుకుంటామని ప్రకటనలు చేశారు. ఈ ప్రసంగాలతో రజాకార్లు రెచ్చిపోయి గ్రామాలపై పడి దాడులకు దిగారు. చాలా చోట్ల ప్రజలు రజాకార్లను ప్రతిఘటించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ వంటి జిల్లాల్లో రజాకార్ల దాడులు పెరిగాయి. అయినా సరే అక్కడి ప్రజలు నిజాం విధించిన నిషేధాన్ని ధిక్కరించి జాతీయ జెండాను ఎగురవేశారు. కొన్ని చోట్ల విద్యార్థులను, యువకులను నిజాం పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ కోటపై జెండా ఎగురవేశారు. నల్గొండలో గ్రామ రక్షక దళాలు రజాకార్లను ఎదుర్కొని చరిత్ర లిఖించాయి. కొన్ని చోట్ల ఆగస్టు 15 అర్థరాత్రి దీపపు వెలుగులలో జాతీయ జెండాను ఎగురవేసి నిజాం పాలకులకు సవాలు విసిరారు.
ఆగస్టు 15వ తేదీ హైదరాబాద్ సంస్థాన ప్రజల పోరాటానికి గుర్తు
భారతదేశం అంతటా ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవ వీచికలు వీస్తే, హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనపై ధిక్కార స్వరం వినిపించిన పోరాటానికి గుర్తుగా నిలిచింది. జాతీయ జెండాను ఎగురవేయడమే స్వాతంత్య్రంగా నాటి హైదరాబాద్ సంస్థాన ప్రజలు ప్రయత్నించి నిజాంకు వ్యతిరేకంగా జట్టుకట్టారు. ఈ పోరాటానికి భారత సైన్యం తోడైన 'ఆపరేషన్ పోలో'తో హైదరాబాద్ సంస్థానం 1948, సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైంది. తెలంగాణ వ్యాప్తంగా నాడు విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకున్నా, చరిత్రలో మాత్రం ప్రజల పోరాటానికి సాక్ష్యంగా ఆగస్టు 15వ తేదీ మిగిలిపోయింది.